ఒంగోలు: చౌకదుకాణాలపై ఆధారపడిన పేదలకు ఇక కష్టాలే ఆహ్వానం పలకనున్నాయి. జిల్లాలోని పౌర సరఫరాల శాఖ వద్ద సరుకుల నిల్వలు గణనీయంగా తగ్గడం.. కొత్త స్టాకు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో చౌక దుకణాల వద్ద కార్డుదారులు పడిగాపులు కాయాల్సిందే. దీనికి తోడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ జత చేయడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కొత్త పథకాలతో పాలన గాడిలో పెడతామన్న టీడీపీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. అధికారులు మంగళవారం నిర్వహించిన సమీక్ష అనంతరం డీలర్లకు ఈ విషయం స్పష్టమైంది.
వణికిస్తున్న ఆధార్ సీడింగ్
జిల్లాలో ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి 75 శాతమే ఆధార్ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి కార్డుదారులో కొంతమంది ఆధార్ నమోదు చేయించుకోలేదు.. మరికొంతమంది తీయించుకున్నా తప్పులు నమోదవ్వడం.. కార్డులు ఇంకా చేతికి రాకపోవడం వంటి కారణాలతో చాలామందికి బ్రేక్ పడింది. జిల్లాలో మొత్తం 8,87,636 కార్డులుండగా 30,23,263 మంది పేర్లు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఆధార్ సీడింగ్ జరుగుతుండటంతో ఒకటికంటే ఎక్కువ ప్రాంతాల్లో కార్డులుంటే తొలగిస్తున్నారు. కొంతమంది తమకు అవసరంలేని కార్డులను ముందుగానే రెవెన్యూ శాఖకు అందజేయలేదు. దీంతో సీడింగ్ సమయంలో ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువచోట్ల ఉన్న కార్డులు తొలగించక తప్పడంలేదు. దీంతో జనాలకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లవుతోంది. ఆధార్ ఉంటేనే రేషన్ ఇవ్వాలని.. దీనికి ఈ నెల 5వ తేదీ తుది గడువని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల 60 శాతం మాత్రమే నమోదు ప్రక్రియ పూర్తవ్వడంతో.. దాదాపు నాలిగింట ఒక వంతు బియ్యం పంపిణీకి కోత పడక తప్పేలా లేదు.
అన్నీ అరకొరగా..
జిల్లాలోని 8.87 లక్షల కార్డులకుగాను గతంలో 12463 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ నెల నుంచి పద్ధతి మార్చడంతో బియ్యం పంపిణీ పూర్తిగా జరిగేలా కనిపించడంలేదు. కార్డుకు కిలో లెక్కన మొత్తం 887 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. కానీ ప్రస్తుతం జిల్లాలోని గోదాముల్లో 90 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్రతి రేషన్ షాపునకు సగం స్టాకు మాత్రమే ఇస్తున్నందున సగం మందికి కందిపప్పు లభించదు. మరికొన్ని చోట్ల దాదాపు పదోవంతు మందికి కూడా అందే అవకాశం లేదు.
ప్రతి కార్డుదారునికి అరకిలో పంచదార ఇస్తారు. పండగ సందర్భాల్లో మరో అరకిలో ఇస్తారు. అంటే దసరా సరుకు కింద సెప్టెంబర్‌లో కిలో పంచదార ఇవ్వాలి. దీని కోసం మొత్తం 887 మెట్రిక్ టన్నుల పంచదార అవసరం. కానీ ప్రస్తుతం 322 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. సాల్ట్ 63 టన్నులు ఉన్నాయి. వాస్తవానికి 824 మెట్రిక్ టన్నులు అవసరం. దీనిపై పౌరసరఫరాల శాఖ డీఎం కొండయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొత్త స్టాక్‌కు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని, త్వరలోనే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి అదనంగా స్టాకు వచ్చే పరిస్థితి లేదన్నారు.
గోదాముల్లో తగ్గిన ‘చౌక’ సరుకులు
Published Thu, Sep 4 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement