Seeding scheme
-
నల్లబజారుకు ‘తెల్ల’బియ్యం!
డీలర్ల మార్పుతో భారీగా అక్రమాలు చౌకబియ్యం నొక్కడానికి అవకాశంగా మారిన ఆధార్ సీడింగ్ కిలో రూ.20కి విక్రయిస్తున్న వైనం ఆపై ఇదే బియ్యానికి కర్ణాటకలో పాలిష్ ఆ బియ్యం బ్యాగు రూ.వెయ్యి జిల్లాలోని పలుచోట్ల చౌకబియ్యం డంప్‌లు ఇదీ ప్రజాపంపిణీ వ్యవస్థ తీరు పలమనేరు: ప్రతి నెలా ప్రజలకందాల్సిన చౌకబియ్యం పక్కదారి పడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలుతోంది. ఈ అక్రమాలు రెండు నెలలుగా జోరందుకున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తోంది. అక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే జిల్లాలో మొత్తం 2,828 చౌకదుకాణాలున్నాయి. వీటికి సంబంధించి 277 ఇన్చార్జ్ డీలర్లు మినహా మిగిలిన చోట్ల రెగ్యులర్ డీలర్లున్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి ప్రతి నెలా అలాట్మెంట్ల మేరకు చౌకదుకాణాలకు 14వేల టన్నులు పీడీఎస్ బియ్యం అందుతోంది. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, సబ్‌జైళ్లు, కస్తూర్బా పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు తదితరాలకు మరో 1,300 టన్నులు డీలర్ల ద్వారా పంపిణీ అవుతున్నాయి. ఈ చౌకదుకాణాల పరిధిలో 9,88,085 మంది కార్డుదారులున్నారు. ఇందులో దాదాపు లక్షకు పైగా బోగస్ కార్డులున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ తతంగమంతా డీలర్లు, అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఫలితంగా కొందరు డీలర్లు అనధికారికంగా రేషన్‌కార్డులను ఉంచుకొని ప్రతినెలా ఆ బియ్యాన్ని అక్రమంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చౌకదుకాణాల్లో తూకాల్లో తేడా కారణంగా భారీగా బియ్యం మిగుల్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రకంగా వీరు ప్రతినెలా బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఆధార్‌తో మరింత అవకాశం చౌకదుకాణాల్లో అక్రమాలను గుర్తించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధార్‌సీడింగ్ చేపడుతోంది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటివరకు 94 శాతం పూర్తయింది. మిగిలిన ఆరు శాతం అంటే దాదాపు 50 వేల మందికి పైగా ఆధార్‌కార్డులు సమర్పించాల్సి ఉంది. ఈ నెలకు సంబంధించిన అలాట్మెంట్ గత నెలలోనే జరిగింది. ప్రస్తుతం అధికారులు ఆధార్‌కార్డు ఇస్తేనే బియ్యం పంపిణీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ లేదనే నెపంతో వీరందరికీ బియ్యం అందలేదు. దీన్ని ఆసరాగా చేసుకొని సేల్ రిజిస్టర్లో అమ్మినట్టుగా లెక్కలు చూపి చౌకబియ్యాన్ని డీలర్లు నొక్కేసినట్టు సమాచారం. డీలర్ల మార్పుతో భారీగా అక్రమాలు ఇన్నాళ్లూ డీలర్లుగా ఉన్న వీరి స్థానంలో అధికార పార్టీ నాయకులకు డీలర్‌షిప్‌లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. పలు మండలాల్లో సంబంధిత నాయకులు తహశీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొందరు ఇన్‌చార్జ్‌లు ఇప్పటికే తెలుగు తమ్ముళ్లతో డీలర్ల జాబితాను జిల్లా మంత్రికి అందజేసినట్లు సమాచారం. ఈ విష యం తెలుసుకున్న పలువురు డీలర్లు ఎలాగూ డీలర్‌షిప్‌లు పోతాయి కాబట్టి అక్రమాలకు పాల్పడదామన్న ధోరణిలో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. చౌకబియ్యం డంప్‌లు డీలర్ల నుంచి చౌకబియ్యాన్ని సేకరించిన వ్యాపారులు జిల్లాలోని నగరి, సత్యవేడు, పలమనేరు, పిచ్చాటూరు, వి.కోట, నాగలాపురం ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యం లోకి తమిళబియ్యాన్ని కలిపి ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్రత్యేక వాహనాల ద్వారా కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో పాలిష్.. స్థానిక డీలర్లు ఈ బియ్యాన్ని వ్యాపారులకు కిలో రూ.20 లెక్కన విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని ఆ వ్యాపారులు కర్ణాటకకు తీసుకెళ్లి కిలో రూ.25గా అమ్ముతున్నారు. అక్కడి వ్యాపారులు బియ్యాన్ని పాలిష్ చేసి 25 కేజీల బ్యాగుల్లో రకరకాల బ్రాండ్ల పేరిట తిరిగి జిల్లాలోకి చేరవేస్తున్నారు. ఇక్కడ ఈ బియ్యం బస్తా రూ.1000 నుంచి రూ.1,200 దాకా అమ్ముతున్నారు. ఈ తంతు రెండు నెలలుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిత్తూరు డీఎస్వో విజయరాణిని వివరణ కోరగా ఆధార్ సీడింగ్ ఉన్న కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేశామని, అక్రమాలకు తావులేదన్నారు. ఏదో చిన్నాచితక జరిగి ఉండవచ్చేమో గానీ భారీ స్థాయిలో మాత్రం ఉండదన్నారు. -
పాస్‌పుస్తకాల సీడింగ్‌లో వెనుకబడ్డాం
కలెక్టర్ యువరాజ్ విశాఖ రూరల్: పట్టాదార్ పాస్‌పుస్తకాల ఆధార్ సీడింగ్‌లో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపుతూ వారి పరిధిలోని భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,75,076 పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయని, వీటిలో 2,80,865 పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో 1,67,261 మంది పట్టాదారుల వివరాలు నోషనల్ ఖాతాలో ఉండగా, వాటిలో కేవలం 3,638 మంది పట్టాదార్ల వివరాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఇప్పటి వరకు కేవలం 59 శాతం పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేస్తూ నమోదు చేయడం జరిగిందని వివరించారు. ఈ సీడింగ్ కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానం కాని భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలు భవిష్యత్తులో నిలుపుదల చేస్తారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ 95 శాతం పూర్తయినందున,ఆ డేటాను సేకరించి పట్టాదార్ల సీడింగ్‌కు వినియోగించాలని చెప్పారు. ఈసమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏజేసీ వై.నరసింహారావు, ఎస్డీసీలు భవానిదాస్, వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు వెంకటమురళి, వసంతరాయుడు, సూర్యారావు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ రత్నం పాల్గొన్నారు. -
ఆపరేషన్ ఏరివేత
ఆధార్ సీడింగ్ పేరుతో5,36,102 మందికి రేషన్ కట్ 2,144 టన్నుల బియ్యం కోత పేదలకు ఇబ్బందులు సరుకుల్లోనూ కుదింపు రేషన్ షాపు యజమానులకూ కష్టకాలం మచిలీపట్నం : ఆధార్ సీడింగ్ పేరుతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆప‘రేషన్ ఏరివేత’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కారణమేదైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బోగస్ కార్డుల కింద భావించి రేషన్ సరుకుల సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ విధంగా రెండు నెలల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సరుకుల సరఫరా నిలిపివేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పేదలు అల్లాడుతున్నారు. కార్డులు జారీ చేసినప్పుడు తెలియదా.! జిల్లాలో 11,23,944 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 31,37,710 మందికి సంబంధించిన ఆధార్‌కార్డుల సీడింగ్ పూర్తి చేశారు. వారిలో 5,36,102 మందిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ నెలకు నాలుగు కిలోల చొప్పున ఇప్పటి వరకు బియ్యం కేటాయిస్తూ వచ్చారు. ఈ నెలలో అనర్హులుగా గుర్తించిన వారికి రేషన్ బియ్యం నిలిపివేయడంతో దాదాపు 2,144 టన్నుల బియ్యం మిగిలిపోయాయి. అన్ని రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ పూర్తయితే అనర్హుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆధార్ సీడింగ్‌కు ఇప్పటి వరకు రాని రేషన్‌కార్డుల్లో ఎక్కువ శాతం బోగస్‌వేనని భావిస్తున్నారు. కొంతమందికి మాత్రమే ఆధార్ కార్డులు ఇంకా అందలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు బోగస్ కార్డులు తమ వద్దే పెట్టుకుని ప్రతి నెలా రేషన్ పొందుతున్న డీలర్ల ఆటలు ఇక సాగవని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బోగస్ కార్డుల వ్యవహారం అధికారులకు తెలియదా.. మంజూరు చేసే సమయంలో నిబంధనలు పాటించలేదా.. అని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల కంప్యూటరీకరణ జిల్లా వ్యాప్తంగా 17ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రేషన్ విడుదల, రికార్డులు రాయడం తదితర ప్రక్రియలు మాన్యువల్‌గానే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద అనేక అవకతవకలకు అవకాశం ఉంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంఎల్ఎస్ పాయింట్లను కంప్యూటరీకరించేందుకు రంగం సిద్ధమైంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కంప్యూటర్లను, ఆపరేటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజరు సింగ్ తెలిపారు. ఇప్పటికే తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్ డీలర్ల వద్ద ఉన్న స్టాకు వివరాలను ఈ-పీడీఎస్ పద్ధతి ద్వారా సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఒక్కో రేషన్ షాపునకు ప్రతి నెలా ఎంత మేర సరుకులు కేటాయించాలనేది నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. డీలర్ల వద్ద నిల్వలు మినహాయించి మిగిలిన సరుకులను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. మిల్లర్లకు ఇబ్బందులు! కేంద్ర ప్రభుత్వం లేవీ బియ్యం కిలో రూ.26 చొప్పున కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేస్తుంది. బోగస్ కార్డుల ద్వారా ఆ బియ్యం పొందిన డీలర్లు వాటిని మిల్లర్లకు రూ.16 చొప్పు విక్రయించడం, మిల్లర్లు అవే బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మళ్లీ రూ.26 లేవీ బియ్యంగా విక్రయించడం జరుగుతోంది. ఈ నెలలో 2,144 టన్నుల బియ్యం కోత విధించడంతో మిల్లర్లు కూడా మండిపడుతున్నారు. నాలుగు సరుకులు మాత్రమే గతంలో అమ్మహస్తం పథకం ద్వారా తొమ్మిది రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేవారు. ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం పామోలిన్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంలేదు. కార్డులో పేరు ఉన్న సభ్యునికి నాలుగు కిలోల బియ్యంతోపాటు ఒక్కో కార్డుకు అర కిలో పంచదార, లీటరు కిరోసిన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పెరిగిన ధరలకు బయట కొనుగోలు చేయలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
గోదాముల్లో తగ్గిన ‘చౌక’ సరుకులు
ఒంగోలు: చౌకదుకాణాలపై ఆధారపడిన పేదలకు ఇక కష్టాలే ఆహ్వానం పలకనున్నాయి. జిల్లాలోని పౌర సరఫరాల శాఖ వద్ద సరుకుల నిల్వలు గణనీయంగా తగ్గడం.. కొత్త స్టాకు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో చౌక దుకణాల వద్ద కార్డుదారులు పడిగాపులు కాయాల్సిందే. దీనికి తోడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ జత చేయడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కొత్త పథకాలతో పాలన గాడిలో పెడతామన్న టీడీపీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. అధికారులు మంగళవారం నిర్వహించిన సమీక్ష అనంతరం డీలర్లకు ఈ విషయం స్పష్టమైంది. వణికిస్తున్న ఆధార్ సీడింగ్ జిల్లాలో ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి 75 శాతమే ఆధార్ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి కార్డుదారులో కొంతమంది ఆధార్ నమోదు చేయించుకోలేదు.. మరికొంతమంది తీయించుకున్నా తప్పులు నమోదవ్వడం.. కార్డులు ఇంకా చేతికి రాకపోవడం వంటి కారణాలతో చాలామందికి బ్రేక్ పడింది. జిల్లాలో మొత్తం 8,87,636 కార్డులుండగా 30,23,263 మంది పేర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆధార్ సీడింగ్ జరుగుతుండటంతో ఒకటికంటే ఎక్కువ ప్రాంతాల్లో కార్డులుంటే తొలగిస్తున్నారు. కొంతమంది తమకు అవసరంలేని కార్డులను ముందుగానే రెవెన్యూ శాఖకు అందజేయలేదు. దీంతో సీడింగ్ సమయంలో ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువచోట్ల ఉన్న కార్డులు తొలగించక తప్పడంలేదు. దీంతో జనాలకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లవుతోంది. ఆధార్ ఉంటేనే రేషన్ ఇవ్వాలని.. దీనికి ఈ నెల 5వ తేదీ తుది గడువని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల 60 శాతం మాత్రమే నమోదు ప్రక్రియ పూర్తవ్వడంతో.. దాదాపు నాలిగింట ఒక వంతు బియ్యం పంపిణీకి కోత పడక తప్పేలా లేదు. అన్నీ అరకొరగా.. జిల్లాలోని 8.87 లక్షల కార్డులకుగాను గతంలో 12463 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ నెల నుంచి పద్ధతి మార్చడంతో బియ్యం పంపిణీ పూర్తిగా జరిగేలా కనిపించడంలేదు. కార్డుకు కిలో లెక్కన మొత్తం 887 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. కానీ ప్రస్తుతం జిల్లాలోని గోదాముల్లో 90 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్రతి రేషన్ షాపునకు సగం స్టాకు మాత్రమే ఇస్తున్నందున సగం మందికి కందిపప్పు లభించదు. మరికొన్ని చోట్ల దాదాపు పదోవంతు మందికి కూడా అందే అవకాశం లేదు. ప్రతి కార్డుదారునికి అరకిలో పంచదార ఇస్తారు. పండగ సందర్భాల్లో మరో అరకిలో ఇస్తారు. అంటే దసరా సరుకు కింద సెప్టెంబర్‌లో కిలో పంచదార ఇవ్వాలి. దీని కోసం మొత్తం 887 మెట్రిక్ టన్నుల పంచదార అవసరం. కానీ ప్రస్తుతం 322 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. సాల్ట్ 63 టన్నులు ఉన్నాయి. వాస్తవానికి 824 మెట్రిక్ టన్నులు అవసరం. దీనిపై పౌరసరఫరాల శాఖ డీఎం కొండయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొత్త స్టాక్‌కు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని, త్వరలోనే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి అదనంగా స్టాకు వచ్చే పరిస్థితి లేదన్నారు. -
నెలాఖరులోగా ఆధార్ సీడింగ్
మండలాధికారులకు జేసీ ఆదేశాలు విశాఖ రూరల్: మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఆధార్ సీడింగ్ ఈ నెలాఖరులోగా శతశాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జేసీ జిల్లాలో మండల, రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఆధార్ సీడింగ్‌పై నిరంతరం సమీక్ష జరుగుతున్నందున ఎప్పటికప్పుడు ప్రగతిని అప్డేట్ చేయాలని సూచిం చారు. జిల్లాలో 57 ఆధార్ కేంద్రాల్లో నమోదు కార్యక్రమం నడుస్తోందని, మందకొడిగా సాగుతున్న చోట అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. పాడేరు ఏజెన్సీలో కొన్ని మండలాల్లో ఆధార్ సీడింగ్ నమోదుపై తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బోగస్ పట్టాదారు పాస్‌పుస్తకాల ద్వారా రుణాలు పొందడంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో పట్టాదారు పాస్‌పుస్తకాల యదార్థతను పరిశీలించాలని తహశీల్దార్లను జేసీ ఆదేశించారు. నెలాఖరులోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణపు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ నరసింహారావు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములునాయుడు, గృహ నిర్మాణ శాఖ పీఓ ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
ఆధార్ సీడింగ్ పూర్తయ్యేనా?
ప్రగతినగర్ :జిల్లాలో పూర్తి స్థాయిలో రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ జరుగుతుందా అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలైలోనే వందశాతం ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటికి కూడా 72.8 శాతం లక్ష్యమే పూర్తయ్యింది. ఇంకో పది శాతం సీడింగ్ జరగడమూ కష్టమేనని భావిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి ప్రభుత్వం జూన్‌లో ఆధార్ కార్డుల నంబర్లను ఈ -పీడీఎస్ ద్వారా అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ జూలై నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. అయితే 68.2 శాతమే సీడింగ్ పూర్తి కావడంతో గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించారు. ఆగస్టు నెల సగం గడిచినా 78.2 శాతమే పూర్తయ్యింది. ఇదే సమయంలో అధికారుల ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను అధికారులకు సరెండర్ చేశారు. అనర్హుల వద్ద తెల్ల రేషన్‌కార్డులుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పలువురు స్వచ్ఛందంగా బోగస్ కార్డులను అప్పగించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా తెల్ల రేషన్‌కార్డులను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో వంద శాతం ఆధార్ సీడింగ్ జరగడం అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో 20 శాతానికి పైగా బోగస్ తెల్ల రేషన్ కార్డులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది ఆధార్ నంబర్లు ఈ -పీడీఎస్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారిని బోగస్ లబ్ధిదారులుగా అనుమానిస్తున్నారు. మరో మూడు లక్షల మంది ఇలా దొరికిపోయే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిని చూస్తే ఆధార్ సీడింగ్ 80 శాతానికి మించేలా లేదని స్పష్టమవుతోంది. ఈనెలాఖరులో అధికారులు సరెండర్ అయిన కార్డులు, రద్దు అయిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపనున్నారు. డీలర్ల అత్యుత్సాహం ఓ వైపు ఆధార్ నంబర్లను ఈ -పీడీఎస్ ద్వారా అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియ సాగుతుండగానే పలువురు రేషన్ డీలర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆధార్ నంబర్లను ఇవ్వని లబ్ధిదారులకు జూలైలో రేషన్ సరుకులను ఇవ్వలేదు. ఆధార్ సీడింగ్‌కు సమయం ఉన్నప్పటికీ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేశారు. అక్రమాల విలువ కోట్లల్లోనే.. జిల్లాలో అన్ని రకాల కార్డులు 7,31,350 ఉన్నాయి. వీటికి ప్రతి నెల 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్ల వద్దే పెద్ద ఎత్తున బోగస్ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రామాలనుంచి వలస వెళ్లడం, కార్డుదారులు చనిపోవడం, ఇతర కారణాలతో రేషన్ సరుకులు తీసుకోనివారి, ఆరోగ్య శ్రీ కోసం కార్డు పొందినవారికి సంబంధించిన రేషన్‌కార్డులను పలువురు డీలర్లు తమ వద్దే ఉంచుకొని సరుకులను తీసుకుంటున్నారు. అనంతరం వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.రేషన్ డీలర్ల వద్ద 13,122 బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఇప్పటివరకు 12,110 కార్డులను డీలర్లు అప్పగించారు. వీరు అప్పగించిన కార్డుల తాలూకు సరుకుల విలువ అర కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. కేవలం జూన్, జూలై మాసాల బియ్యం 60 వేల క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. వీటిని ప్రతి నెల రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేయిస్తూ పక్క జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. బోగస్ కార్డులను పూర్తి స్థాయిలో ఏరివేస్తే నెలకు కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల పాలు కాకుండా కాపాడినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.