నల్లబజారుకు ‘తెల్ల’బియ్యం! | The transition to the huge illegal dealers | Sakshi
Sakshi News home page

నల్లబజారుకు ‘తెల్ల’బియ్యం!

Published Mon, Oct 13 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

నల్లబజారుకు ‘తెల్ల’బియ్యం!

నల్లబజారుకు ‘తెల్ల’బియ్యం!

  • డీలర్ల మార్పుతో భారీగా అక్రమాలు
  • చౌకబియ్యం నొక్కడానికి
  • అవకాశంగా మారిన ఆధార్ సీడింగ్
  • కిలో రూ.20కి విక్రయిస్తున్న వైనం
  • ఆపై ఇదే బియ్యానికి కర్ణాటకలో పాలిష్
  • ఆ బియ్యం బ్యాగు రూ.వెయ్యి
  • జిల్లాలోని పలుచోట్ల చౌకబియ్యం డంప్‌లు
  • ఇదీ ప్రజాపంపిణీ వ్యవస్థ తీరు
  • పలమనేరు: ప్రతి నెలా ప్రజలకందాల్సిన చౌకబియ్యం పక్కదారి పడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలుతోంది. ఈ అక్రమాలు రెండు నెలలుగా జోరందుకున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తోంది.
     
    అక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే

    జిల్లాలో మొత్తం 2,828 చౌకదుకాణాలున్నాయి. వీటికి సంబంధించి 277 ఇన్‌చార్జ్ డీలర్లు మినహా మిగిలిన చోట్ల రెగ్యులర్ డీలర్లున్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి ప్రతి నెలా అలాట్‌మెంట్ల మేరకు చౌకదుకాణాలకు 14వేల టన్నులు పీడీఎస్ బియ్యం అందుతోంది. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, సబ్‌జైళ్లు, కస్తూర్బా పాఠశాలలు, శిక్షణ  కేంద్రాలు తదితరాలకు మరో 1,300 టన్నులు డీలర్ల ద్వారా పంపిణీ అవుతున్నాయి.

    ఈ చౌకదుకాణాల పరిధిలో 9,88,085 మంది కార్డుదారులున్నారు. ఇందులో దాదాపు లక్షకు పైగా బోగస్ కార్డులున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ తతంగమంతా డీలర్లు, అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఫలితంగా కొందరు డీలర్లు అనధికారికంగా రేషన్‌కార్డులను ఉంచుకొని ప్రతినెలా ఆ బియ్యాన్ని అక్రమంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చౌకదుకాణాల్లో తూకాల్లో తేడా కారణంగా భారీగా బియ్యం మిగుల్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రకంగా వీరు ప్రతినెలా బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.
     
    ఆధార్‌తో మరింత అవకాశం

    చౌకదుకాణాల్లో అక్రమాలను గుర్తించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధార్‌సీడింగ్ చేపడుతోంది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటివరకు 94 శాతం పూర్తయింది. మిగిలిన ఆరు శాతం అంటే దాదాపు 50 వేల మందికి పైగా ఆధార్‌కార్డులు సమర్పించాల్సి ఉంది. ఈ నెలకు సంబంధించిన అలాట్‌మెంట్ గత నెలలోనే జరిగింది. ప్రస్తుతం అధికారులు ఆధార్‌కార్డు ఇస్తేనే బియ్యం పంపిణీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ లేదనే నెపంతో వీరందరికీ బియ్యం అందలేదు. దీన్ని ఆసరాగా చేసుకొని సేల్ రిజిస్టర్‌లో అమ్మినట్టుగా లెక్కలు చూపి చౌకబియ్యాన్ని డీలర్లు నొక్కేసినట్టు సమాచారం.
     
    డీలర్ల మార్పుతో భారీగా అక్రమాలు

    ఇన్నాళ్లూ డీలర్లుగా ఉన్న వీరి స్థానంలో అధికార పార్టీ నాయకులకు డీలర్‌షిప్‌లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. పలు మండలాల్లో సంబంధిత నాయకులు తహశీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొందరు ఇన్‌చార్జ్‌లు ఇప్పటికే తెలుగు తమ్ముళ్లతో డీలర్ల జాబితాను జిల్లా మంత్రికి అందజేసినట్లు సమాచారం. ఈ విష యం తెలుసుకున్న పలువురు డీలర్లు ఎలాగూ డీలర్‌షిప్‌లు పోతాయి కాబట్టి అక్రమాలకు పాల్పడదామన్న ధోరణిలో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
     
    చౌకబియ్యం డంప్‌లు

    డీలర్ల నుంచి చౌకబియ్యాన్ని సేకరించిన వ్యాపారులు జిల్లాలోని నగరి, సత్యవేడు, పలమనేరు, పిచ్చాటూరు, వి.కోట, నాగలాపురం ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యం లోకి తమిళబియ్యాన్ని కలిపి ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్రత్యేక వాహనాల ద్వారా కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తున్నట్లు సమాచారం.
     
    కర్ణాటకలో పాలిష్..

    స్థానిక డీలర్లు ఈ బియ్యాన్ని వ్యాపారులకు కిలో రూ.20 లెక్కన విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని ఆ వ్యాపారులు కర్ణాటకకు తీసుకెళ్లి కిలో రూ.25గా అమ్ముతున్నారు. అక్కడి వ్యాపారులు బియ్యాన్ని పాలిష్ చేసి 25 కేజీల బ్యాగుల్లో రకరకాల బ్రాండ్‌ల పేరిట తిరిగి జిల్లాలోకి చేరవేస్తున్నారు. ఇక్కడ ఈ బియ్యం బస్తా రూ.1000 నుంచి రూ.1,200 దాకా అమ్ముతున్నారు. ఈ తంతు రెండు నెలలుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిత్తూరు డీఎస్‌వో విజయరాణిని వివరణ కోరగా ఆధార్ సీడింగ్ ఉన్న కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేశామని, అక్రమాలకు తావులేదన్నారు. ఏదో చిన్నాచితక జరిగి ఉండవచ్చేమో గానీ భారీ స్థాయిలో మాత్రం ఉండదన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement