నెలాఖరులోగా ఆధార్ సీడింగ్
- మండలాధికారులకు జేసీ ఆదేశాలు
విశాఖ రూరల్: మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఆధార్ సీడింగ్ ఈ నెలాఖరులోగా శతశాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జేసీ జిల్లాలో మండల, రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర స్థాయిలో ఆధార్ సీడింగ్‌పై నిరంతరం సమీక్ష జరుగుతున్నందున ఎప్పటికప్పుడు ప్రగతిని అప్‌డేట్ చేయాలని సూచిం చారు. జిల్లాలో 57 ఆధార్ కేంద్రాల్లో నమోదు కార్యక్రమం నడుస్తోందని, మందకొడిగా సాగుతున్న చోట అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. పాడేరు ఏజెన్సీలో కొన్ని మండలాల్లో ఆధార్ సీడింగ్ నమోదుపై తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
బోగస్ పట్టాదారు పాస్‌పుస్తకాల ద్వారా రుణాలు పొందడంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో పట్టాదారు పాస్‌పుస్తకాల యదార్థతను పరిశీలించాలని తహశీల్దార్లను జేసీ ఆదేశించారు. నెలాఖరులోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణపు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ నరసింహారావు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములునాయుడు, గృహ నిర్మాణ శాఖ పీఓ ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్ పాల్గొన్నారు.