ప్రగతినగర్ :జిల్లాలో పూర్తి స్థాయిలో రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ జరుగుతుందా అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలైలోనే వందశాతం ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటికి కూడా 72.8 శాతం లక్ష్యమే పూర్తయ్యింది. ఇంకో పది శాతం సీడింగ్ జరగడమూ కష్టమేనని భావిస్తున్నారు.
బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి ప్రభుత్వం జూన్‌లో ఆధార్ కార్డుల నంబర్లను ఈ -పీడీఎస్ ద్వారా అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ జూలై నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. అయితే 68.2 శాతమే సీడింగ్ పూర్తి కావడంతో గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించారు. ఆగస్టు నెల సగం గడిచినా 78.2 శాతమే పూర్తయ్యింది.
ఇదే సమయంలో అధికారుల ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను అధికారులకు సరెండర్ చేశారు. అనర్హుల వద్ద తెల్ల రేషన్‌కార్డులుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పలువురు స్వచ్ఛందంగా బోగస్ కార్డులను అప్పగించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా తెల్ల రేషన్‌కార్డులను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో వంద శాతం ఆధార్ సీడింగ్ జరగడం అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది.
జిల్లాలో 20 శాతానికి పైగా బోగస్ తెల్ల రేషన్ కార్డులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది ఆధార్ నంబర్లు ఈ -పీడీఎస్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారిని బోగస్ లబ్ధిదారులుగా అనుమానిస్తున్నారు. మరో మూడు లక్షల మంది ఇలా దొరికిపోయే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిని చూస్తే ఆధార్ సీడింగ్ 80 శాతానికి మించేలా లేదని స్పష్టమవుతోంది. ఈనెలాఖరులో అధికారులు సరెండర్ అయిన కార్డులు, రద్దు అయిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపనున్నారు.
డీలర్ల అత్యుత్సాహం
ఓ వైపు ఆధార్ నంబర్లను ఈ -పీడీఎస్ ద్వారా అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియ సాగుతుండగానే పలువురు రేషన్ డీలర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆధార్ నంబర్లను ఇవ్వని లబ్ధిదారులకు జూలైలో రేషన్ సరుకులను ఇవ్వలేదు. ఆధార్ సీడింగ్‌కు సమయం ఉన్నప్పటికీ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేశారు.
అక్రమాల విలువ కోట్లల్లోనే..
జిల్లాలో అన్ని రకాల కార్డులు 7,31,350 ఉన్నాయి. వీటికి ప్రతి నెల 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్ల వద్దే పెద్ద ఎత్తున బోగస్ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రామాలనుంచి వలస వెళ్లడం, కార్డుదారులు చనిపోవడం, ఇతర కారణాలతో రేషన్ సరుకులు తీసుకోనివారి, ఆరోగ్య శ్రీ కోసం కార్డు పొందినవారికి సంబంధించిన రేషన్‌కార్డులను పలువురు డీలర్లు తమ వద్దే ఉంచుకొని సరుకులను తీసుకుంటున్నారు.
అనంతరం వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.రేషన్ డీలర్ల వద్ద 13,122 బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఇప్పటివరకు 12,110 కార్డులను డీలర్లు అప్పగించారు. వీరు అప్పగించిన కార్డుల తాలూకు సరుకుల విలువ అర కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. కేవలం జూన్, జూలై మాసాల బియ్యం 60 వేల క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. వీటిని ప్రతి నెల రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేయిస్తూ పక్క జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. బోగస్ కార్డులను పూర్తి స్థాయిలో ఏరివేస్తే నెలకు కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల పాలు కాకుండా కాపాడినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.
ఆధార్ సీడింగ్ పూర్తయ్యేనా?
Published Wed, Aug 20 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement
Advertisement