వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధానంలో గతంలో ఉన్న విధానానికి, ప్రస్తుత విధానానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడాల కారణంగానే తమ ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. గతంలో సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలు సాంకేతికంగా పెద్దగా ఇబ్బందులు పడకుండానే క్రయవిక్రయ లావాదేవీలు జరుపుకునే పరిస్థితి ఉండగా.. మారిన విధానం ప్రకారం అన్ని నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్త వుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాపర్టీ ఇండెక్స్ (టీ–పిన్) ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీ–టిన్)ల పేరిట ప్రభుత్వం అడుగుతున్న నంబర్లే ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ నంబర్లతో పాటు దాదాపు 10 అంశాల్లో ఉన్న తేడాలు వారి ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్
తప్పులొస్తే అంతే సంగతులు..
గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన విధానానికి, తాజాగా జరుగుతున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు చాలా తేడాలున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. గతంలో డాక్యుమెంట్ రాసే క్రమంలో పొరపాటున తప్పులు జరిగినా సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేసే సమయంలో ఎడిట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి పద్ధతిలో ఒక్కసారి వివరాలు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ కోసం నమోదు చేస్తే వాటిని మార్చుకునే అవకాశం లేదు. ఖాళీ స్థలాలకు ఇస్తున్న టి–పిన్, నిర్మాణాలకు ఇస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీ–టిన్)లు కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నంబర్లను గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవ్వాల్సి రావడంతో ప్రతి రిజిస్ట్రేషన్ కోసం వాటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.
ఈ నంబర్ మంజూరు చేసే విషయంలో స్థానిక సంస్థలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేసి నేరుగా ప్రభుత్వ శాఖల మధ్యనే ఈ లావాదేవీ జరిగేలా మార్పు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలంటే వారసులు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. ప్రస్తుత విధానంలో ఆ సర్టిఫికెట్ సరిపోదు. వారసులు స్థానిక సంస్థలకు వెళ్లి చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్ పెట్టి టీ–పిన్ లేదా పీ–టిన్ తెచ్చుకోవాల్సిందే. ఆ నంబర్ వారసుల పేరు మీద ఉంటేనే స్లాట్ బుక్ అవుతోంది. అలాగే గతంలో రాము అనే వ్యక్తి పవన్‌కు ఆస్తి లేదా భూమి అమ్మి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఆస్తి లేదా భూమి మ్యుటేషన్ కాకముందే అశోక్ అనే మూడో వ్యక్తికి అమ్ముకునే వీలుండేది. కానీ ఇప్పుడు పవన్ పేరిట రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ కూడా చేయించుకుని, అప్పుడు అశోక్‌కు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది.
ఇదొక్కటే ఉపశమనం..
కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిపేందుకు తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అధికారికంగా ఓ ఫార్మాట్ రూపొందించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్కయిన తర్వాత జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్రంలోని ప్రజలందరికీ ఒకే విధంగా ఉండేలా రూపొందించారు. ఇక్కడే ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని గుర్తించిన అధికారులు ఈ ఒక్క విషయంలో మాత్రం ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. గతంలో స్టాంపు పేపర్ మీద డాక్యుమెంట్ రాసుకుని (ఆ డాక్యుమెంట్‌లో క్రయ, విక్రయదారులకు అనుకూలంగా షరతులు, నిబంధనలు పెట్టుకునే వారు) ఆ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు. ఇప్పుడేమో ఆన్‌లైన్‌లో వివరాలు పూర్తి చేయాల్సి ఉన్నందున, ఆ మేర షరతులు, నిబంధనలకు అవకాశం లేకుండా పోయింది.
రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ హెడ్ మీద ప్రభుత్వ లోగో ఉన్న తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తోంది. అయితే క్రయ, విక్రయదారులు కావాలనుకుంటే సొంత డాక్యుమెంట్ కూడా తయారు చేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించాలకునే వారు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత తమకు నచ్చిన రీతిలో తెల్ల కాగితం లేదా స్టాంపు పేపర్ మీద డాక్యుమెంట్ తయారు చేసుకుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లొచ్చు. అప్పుడు ఆ డాక్యుమెంట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ విషయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు కొంత ఉపశమనం కలిగించేలా ఉంది.
తేడాలివీ..
గతంలో ఇప్పుడు
ఆన్‌లైన్ స్లాట్ తప్పనిసరి కాదు ఆన్‌లైన్ స్లాట్ ఉంటేనే రిజిస్ట్రేషన్
ఖాళీస్థలాలకు టీ–పిన్ అవసరం లేదు ఆ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్కవుతుంది
నిర్మాణాలకు పీ– టిన్ అవసరం లేదు ఆ నంబర్ ఉంటేనే స్లాట్ పూర్తి
తప్పొప్పులు సరిచేసుకునే అవకాశం ఉంది ఒక్కసారి డాక్యుమెంట్ వస్తే ఇక అంతే
నాలా పన్ను చెల్లిస్తే సరిపోయేది నాలాతో పాటు టీ–పిన్ తప్పనిసరి
చలానాకు 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యేది కాలపరిమితి ఎక్కడా చెప్పలేదు
ఇంటి పన్ను, కరెంటు బిల్లు పట్టించుకునే వారు కాదు ఇప్పుడు అవి తప్పనిసరి
మ్యుటేషన్ కాక ముందే ఇతరులకు అమ్ముకోవచ్చు ఇప్పుడు మ్యుటేషన్ తర్వాతే ఏదైనా
జీపీఏ, ఎస్పీలు ఉండేవి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు
వారసులకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఉంటే చాలు వారసులకు టీ–పిన్ ఉండాల్సిందే
అధికారిక లేఅవుట్లకు టీ–పిన్ అవసరం లేదు ఇప్పుడు తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment