ఆస్తులు రిజిస్ట్రేషన్‌ 15 నిమిషాల్లోనే పూర్తి | Property Registration Complete In 15 Minutes In Dharani | Sakshi
Sakshi News home page

డీఎస్‌కు ‘ధరణి’ కష్టాలు! 

Published Tue, Dec 15 2020 3:36 AM | Last Updated on Tue, Dec 15 2020 3:36 AM

Property Registration Complete In 15 Minutes In Dharani - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో నే కొత్తగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. క్రయ, విక్రయదారుల నమోదు నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లో పూర్తి చేసి.. నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్తే సులభంగానే ఈ ప్రక్రియ పూర్తవుతోందని తొలిరోజు పరిశీలన చెబుతోంది. 

 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా సాగుతుంది! 

  • వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. 
  • సిటిజన్‌ లాగిన్, డెవలపర్స్, బిల్డర్స్‌కు ప్రత్యేక లాగిన్‌ ఇచ్చారు. 
  • అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత పీ టిన్‌ (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇండెక్స్‌ నంబర్‌)ను నమోదు చేయాలి. అయితే ఆ ఆస్తి లేదా భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదై ఉంటేనే సదరు వివరాలు కన్పిస్తాయి. 
  • ఆ తర్వాత ఫ్లాట్‌ విస్తీర్ణం, నిర్మాణ విస్తీర్ణం కన్పిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మార్కెట్‌ విలువ మేర ఫీజు, మ్యుటేషన్‌ ఫీజు చెల్లించాలి. అప్పుడు స్లాట్‌ బుక్‌ అవుతుంది.  
  • స్లాట్‌ బుక్‌ కాగానే క్రయ, విక్రయదారులు, సాక్షులు నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ స్లాట్‌ అడ్వైజరీ రిపోర్ట్‌ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయ, విక్రయదారులు, సాక్షుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. వెబ్‌సైట్‌ నుంచి సబ్‌రిజిస్ట్రార్లే ఒక ఫారంను డౌన్‌లోడ్‌ చేసి సంతకాలు చేయిస్తారు. మళ్లీ దాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ సిద్ధమవుతుంది. మ్యుటేషన్‌ వివరాలు కూడా అందులో ఉంటాయి. సదరు ఆస్తికి సంబంధించిన ఈ–పాస్‌బుక్‌ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత రూ.300 చెల్లిస్తే సదరు ఆస్తికి సంబంధించిన మెరూన్‌ రంగు పాసుపుస్తకం కొనుగోలుదారుడి ఇంటికి వస్తుంది.  
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఎలాంటి స్టాంపు పేపర్‌ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ లోగో, మాస్టర్‌హెడ్‌తో తెల్లకాగితం మీదే డాక్యుమెంట్‌ వస్తోంది. అయితే, ఈ డాక్యుమెంట్‌తో పాటు మెరూన్‌ రంగు పాసుపుస్తకం ఉంటేనే చట్టబద్ధం అవుతుంది.  
  • ఈ ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అన్ని వివరాలు నమోదు చేసి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితేనే స్లాట్‌ బుక్‌ అవుతుంది.  ఆంగ్ల పరిజ్ఞానం లేని వారు, నిరక్షరాస్యులు మీ–సేవకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.  
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 పేజీల డాక్యుమెంట్‌ వస్తుంది. ఇందులో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు, క్రయవిక్రయదారులు, సాక్షుల వివరాలు, షెడ్యూల్‌ ఆఫ్‌ ప్రాపర్టీ, సేల్‌ డీడ్‌ వస్తున్నాయి. ఇక, పాసు పుస్తకం కూడా 2 పేజీలు వస్తుంది.  

డీఎస్‌కు ‘ధరణి’ కష్టాలు! 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు ధరణి పోర్టల్‌ కష్టాలు తప్పలేదు. ఇటీవల తన వ్యవసాయ భూమిని విక్రయించిన ఆయన.. కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు సోమవారం నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. అయితే, రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఆధార్‌ వెరిఫికేషన్‌ కోసం వేలిముద్రలు, ఐరిస్‌ సంబంధిత పోర్టల్‌లో సరిపోలకపోవడంతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజామాబాద్‌ రూరల్‌ మండలం సారంగపూర్‌ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తన 3.5 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన నవంబర్‌ 12న తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు డీఎస్‌ వేలిముద్రలు, ఐరిస్‌ ఆధార్‌ కార్డులోని వివరాలతో సరిపోలలేదు.

దీంతో అప్పుడు రిజిస్ట్రేషన్‌ పూర్తి కాకుండానే వెనుదిరిగారు. డీఎస్‌ ఇటీవల కంటి ఆపరేషన్‌ చేయించుకోవడంతో ఐరిస్‌ ట్యాలీ కాలేదని భావించారు. దీంతో ఆయన ఇటీవల ఆధార్‌ కార్డులో తన వేలిముద్రలు, ఐరిస్‌ను అప్‌డేట్‌ చేసుకున్నారు. అప్‌డేట్‌ చేసిన ఆధార్‌ కార్డుతో సోమవారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి రాగా, ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తన వేలిముద్రలు, ఐరిస్‌ మ్యాచింగ్‌ కాలేదు. పలుమార్లు వేలిముద్రలు, ఐరిస్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రెవెన్యూ అధికారులు సాంకేతిక నిపుణుడి సాయం తీసుకోవడంతో ఎట్టకేలకు వేలిముద్రలు, ఐరిస్‌ మ్యాచ్‌ అయ్యాయి. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేశారు. భూమి రిజిస్ట్రేషన్‌ కోసం డీఎస్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి రావడం ఇది మూడోసారి.. 

తొలి రోజు రిజిస్ట్రేషన్లు 82
సాక్షి, హైదరాబాద్‌: మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగాయని, సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకోకుండానే కొందరు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారని, స్లాట్‌ బుక్‌ చేసుకొని వారికి రిజిస్ట్రేషన్లు జరపబోమని స్పష్టం చేశారు. మంగళవారం 58 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్లాట్లు బుక్‌ అయ్యాయని వెల్లడించారు.  

అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్‌
సాక్షి, నెట్‌వర్క్‌: అమావాస్య సెంటిమెంట్‌కు తోడు సాంకేతిక సమస్యలతో తొలిరోజు ఆయా జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గందరగోళంగా కొనసాగింది. నిబంధనల మేరకు పలు పత్రాలను సమర్పించాల్సి ఉండటంతో చాలామంది వాటిని అందజేయలేక ఇబ్బందిపడ్డారు. సర్వర్ల మొరాయింపుతో పలుచోట్ల స్లాట్లు బుక్‌కాలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 21 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 1 రిజిస్ట్రేషన్‌ కాగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కటీ కాలేదు.

అరగంటలోనే పనైంది..
నా భర్త పేరిట ఉన్న ఆర్‌సీసీ భవనం (బిల్డింగ్‌) నా పేరిట దానపూర్వకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా. గతంలో దీనికోసం 3 నెలలు తిరిగి వేసారిపోయాం. కొత్త విధానంలో ముందే స్లాట్‌ బుక్‌ చేసుకుని.. ఈరోజు దుబ్బాక ఆఫీస్‌కు వెళ్లగా అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. – కాస్తి యాదమ్మ రాములు,  ధర్మాజీపేట, దుబ్బాక మున్సిపాలిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement