హైదరాబాద్‌లో సమావేశమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కేబినెట్ సబ్ కమిటీ. చిత్రంలో మంత్రులు వేముల, కేటీఆర్, తలసాని, ఎర్రబెల్లి, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ మంగళవారం మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్.. మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం 100 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడ్డారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా ఉండే పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఉపసంఘం సమావేశం అనంతరం సభ్యులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో అన్ని అవరోధాలను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ఇందుకోసం అధికారులను మూడు బృందాలుగా విభజించామని వెల్లడించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఓ బృందం, చట్టపరమైన ఇబ్బందులకు మరో బృందం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు మరో బృందంగా ఏర్పడి అధికారులు పనిచేస్తారని చెప్పారు.
నాలుగు కేటగిరీలుగా విభజన..
ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లో ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించామని వివరించారు. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నా తొలగిస్తామని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జీపీఏ, ఎస్పీఏలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సేల్ డీడ్‌లపై ఉన్న అపోహలను తొలగిస్తామని చెప్పారు.
కొనుగోలుదారులు, అమ్మకందారులు తమకు ఇబ్బంది లేని రీతిలో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. పీటీఐఎన్ అనేది యునిక్ నంబర్ అని, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా, అవకతవకల్లేకుండా ఉండేందుకే దీన్ని పొందుపరిచామని చెప్పారు. ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, దశల వారీగా అన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వస్తున్న అన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూసే కోణంలోనే మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ‘ఇష్యూ ట్రాకర్’ద్వారా పరిష్కరిస్తున్నామని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లే!
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) అంశం ఇప్పట్లో తేలేలా కన్పించట్లేదు. ఈ అంశం పరిష్కారానికి సమయం పడుతుందని, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకే పరిమితం కావా లని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించింది. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని అధికారులతో పేర్కొంది. సమావేశంలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ లేని లేఅవుట్ల గురించి ప్రస్తావన రాగా, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లపై దృష్టి పెట్టాలని, ఎల్‌ఆర్‌ఎస్ గురించి మరో సమావేశంలో మాట్లాడుకుందామని మంత్రులు చెప్పినట్లు సమా చారం. కాగా, ఈనెల 17న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగస్వాములైన అన్ని వర్గాలతో వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లోఇబ్బందులు ఉంటాయి. వాటినిఅధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్‌సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించాం. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నాతొలగిస్తాం. – వేముల ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment