Telangana: ధరణి.. దారికెన్నడో? | Dharani Portal Facing Lot Of Technical Issues In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: ధరణి.. దారికెన్నడో?

Published Sat, Nov 13 2021 2:37 AM | Last Updated on Sat, Nov 13 2021 2:08 PM

Dharani Portal Facing Lot Of Technical Issues In Telangana - Sakshi

ఈ రైతు పేరు గంగుల శ్రీనివాస్‌. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుమ్ముడూరుకు చెందిన ఆయన కుటుంబానికి ప్రభుత్వం గతంలో రెండెకరాల భూమి (సర్వే నంబర్‌ 287/110లో ఒకటిన్నర ఎకరం, 287/133లో అర ఎకరం)ని అసైన్‌ చేసింది. దానికి పాస్‌బుక్‌లు కూడా ఉన్నాయి. మొదట్లో శ్రీనివాస్‌ తాత, తర్వాత తండ్రి, పినతండ్రి, ఇప్పుడు శ్రీనివాస్‌ ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవలి భూరికార్డుల ప్రక్షాళన తర్వాత శ్రీనివాస్‌కు కొత్త పాస్‌బుక్‌ ఇవ్వలేదు. అధికారుల ఆదేశాల మేరకు ఈ సర్వే నంబర్‌లో భూమిని మరోసారి సర్వే చేశారు కూడా. పాస్‌బుక్‌ కోసం కలెక్టర్, తహసీల్దార్‌ల వద్దకు వెళితే.. సమస్య సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉందని, ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తేగానీ పరిష్కారం కాదని అంటున్నారు. 




ఈ చిత్రంలోని రైతు అనాసి శ్రీనివాస్‌కు పెద్దపల్లి జిల్లా కేంద్రం శివార్లలోని సర్వే నంబర్‌ 68లో ఎకరం భూమి ఉంది. తాతల కాలం నుంచి కాస్తులో ఉండి ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. పాత పాస్‌బుక్‌ కూడా ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చే సమయంలో ఆ భూమిని ఇతరుల పేర్లపై నమోదు చేశారు. భూమి విస్తీర్ణం కూడా తగ్గించారు. న్యాయం చేయాలంటూ తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ వరకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. 




భూమిని తక్కువగా వేసి.. 
ఈ రైతు పేరు వీరబోయిన రాజం. ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామానికి చెందిన ఈయనకు నాంసానిపల్లి రెవెన్యూ పరిధిలోని 337, 515 సర్వే నంబర్లలో కొంత భూమి ఉంది. కొత్త పాస్‌బుక్కులు ఇచ్చేటప్పుడు.. 337లో 10 గుంటలు, 515లో 6 గుంటల భూమిని తక్కువగా నమోదు చేశారు. తన మొత్తం భూమి వివరాలను పాస్‌బుక్‌లో చేర్చాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. 





ధరణిలో నమోదు కాలేదంటున్నరు 
మా అమ్మ పేరు మీద రెండెకరాల భూమి ఉంది. భూప్రక్షాళన కంటే ముందు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేదు. ఇదేమంటే ధరణిలో నమోదు కాలేదని, మిస్సింగ్‌ ఖాతా కింద కంప్యూటరీకరణ ఆగిపోయిందని చెప్తున్నారు. మాకు రైతు బీమా, రైతుబంధు రావడం లేదు. అవసరానికి భూమిని అమ్ముకునే వీల్లేకుండా పోయింది. రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం.     – దెంది రమణారెడ్డి, పుల్జాల, నాగర్‌కర్నూల్‌ జిల్లా 




పట్టా భూమిని.. లావణి భూమి అంటున్నరు 
మా గ్రామంలోని 485 సర్వే నంబర్‌లో 7.05 ఎకరాల భూమిని కొని, నా భార్య యమున పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. ధరణి రికార్డుల్లో భూమి నమోదు కాలేదు. ఇదేమని అడిగితే అది లావణి భూమి అంటున్నారు. పట్టా భూమి అని, కావాలంటే సర్వే చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చాను   – కిష్టయ్య, ఇసన్నపల్లి గ్రామం, భిక్కనూరు మండలం, కామారెడ్డి జిల్లా 



.. ఇదీ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు పడుతున్న బాధ. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా.. వ్యవసాయ భూ ముల లావాదేవీల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ ఈ సమస్యలకు కారణమవుతోంది. పోర్టల్‌లో.. తాతల కాలం నుంచీ అనుభవిస్తూ, సాగు చేసుకుంటున్న భూముల వివరాలు కూడా మారిపోవడం, వేరేవారి పేర్ల మీద నమోదుకావడం, అసలు జాడే లేకుండా పోవడం వంటి సమస్యలతో రైతులు ముప్పుతిప్పలు పడు తున్నారు. అత్యవసరానికి భూమిని అమ్ముకోవాలనుకున్నా.. నాలుగు డబ్బులు వెనకేసి కొంత భూమి కొనుక్కో వాలనుకున్నా.. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమ స్యలు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) వర్గాల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ధరణి’ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు.  ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆప్షన్‌ ఇవ్వడం, అది సరిగా పనిచేయకపోవడం, తప్పు ఎక్కడ ఉందో కూడా గుర్తించలేని దుస్థితి తలెత్తడం గమనార్హం. 

కలెక్టర్లకు ఫిర్యాదుల్లో ‘ధరణి’పైనే అధికం.. 
ధరణిలో నమోదైన తప్పులను సవరించాలంటూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మీసేవ కేం ద్రాల్లో దరఖాస్తు సమర్పించడం మొదలు.. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణల దాకా నానా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్లకు ప్రతివారం గ్రీవెన్స్‌లలో వచ్చే ఫిర్యాదుల్లో.. ధరణి ఫిర్యాదులే 65–70 శాతం వరకు ఉంటున్న పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్ల లాగిన్‌లలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్నిచోట్ల 2 నెలల నుంచి పది నెలల వరకు ఫైళ్లు ఆగిపోయాయని అధికారవర్గాలే చెప్తున్నాయి. తిరిగి తిరిగి రైతుల కాళ్లు అరుగుతున్నాయే తప్ప.. ధరణి సమస్యలు పరిష్కారం కావడం లేదని, తమ వద్దకు వచ్చే రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని తహసీల్దార్లు అంటున్నారు. 

కీలక సమస్యలను గుర్తించినా.. 
ధరణి సమస్యలపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించిన ప్రభుత్వం.. 18 కీలక సమస్యలను రెండు నెలల క్రితమే గుర్తించింది. భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూముల వర్గీకరణలో తప్పులు, భూమి స్వభావం (పట్టా/అసైన్డ్‌) రెవెన్యూ రికార్డులకు, ధరణి వివరాలకు సరిపోలకపోవడం, భూమి ఎలా సంక్రమించిందనే వివరాల్లో తప్పులు, పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, ఇనాం భూముల విషయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీకి ఆప్షన్‌ లేకపోవడం, పట్టాభూములనూ నిషేధిత జాబితాలో చేర్చడం, సర్వే నంబర్ల వారీగా ఈసీలు చూసుకునే వీలు లేకపోవడం, ఈసీతోపాటు మార్కెట్‌ విలువ సర్టిఫికెట్లు ఇచ్చే ఆప్షన్‌ లేకపోవడం, డబుల్‌ ఖాతాల విలీనం వంటివి ఇబ్బందికరంగా మారాయని తేల్చింది. కానీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) బృందం.. సదరు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 

కలెక్టర్లకు పనిభారంతో.. 
ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కారించే అధికారాలను కలెక్టర్లకే అప్పగించారు. ధరణి ద్వారా ఏ సమస్య పరిష్కారానికైనా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులన్నీ కలెక్టర్‌ లాగిన్‌కు చేరతాయి. అక్కడి నుంచి తహసీల్దార్‌ లాగిన్‌కు పంపుతారు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి గడువు లేకపోవడంతో.. కలెక్టర్లు 15–20 రోజులకోసారి తహసీల్దార్లకు పంపుతున్నారు. తహసీల్దార్లు వాటిని పరిశీలించి ఆన్‌లైన్‌తోపాటు మ్యాన్యువల్‌ రికార్డుల ను తయారు చేసి ఆర్డీవోలకు పంపాలి. సదరు ఆన్‌లైన్, మ్యాన్యువల్‌ రికార్డుతోపాటు ఆర్డీవో నోట్‌ఫైల్‌ తయారు చేసి మళ్లీ ఆన్‌లైన్‌ దరఖాస్తును కలెక్టర్‌ లాగిన్‌కు పంపాలి. మ్యాన్యువల్‌ రికార్డును డీఆర్వో ఆఫీస్‌లో సమర్పించాలి. తహసీల్దార్, ఆర్డీవోలు చేసే సిఫార్సును బట్టి.. సదరు దరఖాస్తును ఆమోదించడానికి, తిరస్కరించడానికి కలెక్టర్‌కు అధికారం ఉంటుంది. ఇదంతా జరగడానికి చాలా కాలం పడుతోందని రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement