
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో తవ్వే కొద్దీ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. భూవిస్తీర్ణంలో మార్పులకు అవకాశం ఇవ్వకపోవడం, కొత్త పహాణీలు అందుబాటులో లేకపోవడం, ఏజీపీఏలను పరిగణనలోకి తీసుకోక పోవడం వంటి పలు సమస్యలు బయటపడుతున్నాయి. ఇటీవల భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)గా బాధ్యతలు చేపట్టిన నవీన్‌మిత్తల్.. రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యల్లో ప్రధానమైన ధరణి పోర్టల్‌ను సులభతరం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న కీలక సమస్యలను గుర్తించి పరిష్కరించే క్రమంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి అక్కడి రెవెన్యూ యంత్రాంగంతో గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు, జిల్లాలోని అందరు తహసీల్దార్లతో సమావేశమై ప్రధానంగా ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి గల అవకాశాలను గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కార లాగిన్ జిల్లా కలెక్టర్లకు కాకుండా తహసీల్దార్లకు ఇవ్వాలని కొందరు సూచించినట్టు తెలిసింది. ధరణిలో అటు రైతులకు, ఇటు రెవెన్యూ యంత్రాంగానికి ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలపై యాదాద్రి జిల్లా యంత్రాంగం ఓ నివేదికను కూడా మిత్తల్‌కు అందజేసింది. కాగా ‘పైలట్’తరహాలో యాదాద్రికి వచ్చిన మిత్తల్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రెవెన్యూ అధికారులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం.
తాజా అధ్యయనంలో వెల్లడైన కీలక సమస్యలివే..
ఒక రైతుకు వాస్తవానికి ఎకరం భూమి ఉంటే ధరణి రికార్డుల్లో రెండు ఎకరాలుగా పొరపాటుగా నమోదైంది. ఈ పొరపాటును సవరించే/తొలగించే ఆప్షన్ ధరణి పోర్టల్‌లో అందుబాటులో లేదు. గతంలో కొందరు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసుకున్నారు. ఈ భూములకు నాలా ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయి. కానీ కొన్నిచోట్ల అవి వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో సదరు రైతులు/సంస్థలు/పరిశ్రమలు తమ భూముల మారి్పడి కోసం ధరణిలోని 33 మాడ్యూల్ కింద మిస్సింగ్ సర్వే నంబర్ల కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను కలెక్టర్ లాగిన్‌లో పరిష్కరించిన తర్వాత కూడా అవి వ్యవసాయ భూములుగానే కనబడుతున్నాయి.
కొన్ని భూములకు ఇచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏజీపీఏ)లు ధరణిలో ప్రాసెస్ కావడం లేదు. వీటిని ప్రాసెస్ చేసేందుకు పట్టాదారు బయోమెట్రిక్ వివరాలను ధరణి పోర్టల్ అడుగుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు అసలు పట్టాదారుకు కాకుండా థర్డ్ పారీ్టలు కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఒక సర్వే నంబర్‌లో థర్డ్ పార్టీలు (పట్టాదారుకు తెలియకుండా) దరఖాస్తు చేసుకుని ఉంటే.. అసలు పట్టాదారు లేదా ఆ సర్వే నంబర్‌లోని మరో పట్టాదారు దరఖాస్తు చేసుకునేందుకు ధరణి అనుమతించడం లేదు. ఇప్పటికే దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెబుతోంది. ఈ విషయంలో థర్డ్ పార్టీలను నియంత్రించే పద్ధతి తీసుకురావాలి. ధరణి పోర్టల్‌లో తాజా పహాణీలు అందుబాటులో లేవు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్ల లాగిన్‌లలో కొత్త పహాణీలు అందుబాటులో ఉంచాలి.
కొందరు రైతులు తమ భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. అలాంటి మారి్టగేజ్ భూములకు డూప్లికేట్ పాసు పుస్తకాలు తీసుకుని సేల్‌డీడ్‌లు చేసుకునే వెసులుబాటును తొలగించాలి. ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులకు సంబంధించిన వివరాలను పొరపాటుగా నమోదు చేస్తే, దరఖాస్తు పూర్తయిన తర్వాత మళ్లీ ఆ వివరాలను సవరించుకునే అవకాశం లేదు. వారసత్వ హక్కులు (పౌతీ) కల్పించే క్రమంలో ఈ–పాసు పుస్తకాలు వస్తున్నాయి కానీ, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు పౌతీ ప్రొసీడింగ్స్ అడుగుతున్నారు. ధరణి పోర్టల్‌లో ఆధునీకరించిన లేదా సవరించిన వివరాలు అందుబాటులో లేవు. సదరు రైతుకు సంబంధించిన అప్‌డేటెడ్ సమాచారం (సర్వే నంబర్, ఖాతా, విస్తీర్ణం లాంటి వివరాలు) అందుబాటులో ఉంచాలి. గతంలో ఆర్డీవోలు జారీ చేసిన నాలా ప్రొసీడింగ్స్‌ను అప్‌డేట్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. గతంలో జారీ చేసిన 13–బి, 38ఈ సర్టిఫికెట్ల అప్‌డేషన్‌కు కూడా ఆప్షన్ తీసుకురావాలి. క్రయ విక్రయ లావాదేవీల కోసం బుక్ చేసిన స్లాట్‌లను అనివార్య పరిస్థితుల్లో రద్దు చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment