ముచ్చటించుకుంటున్న రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్‌ను ఎలా మార్చాలన్న దానిపై ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ పనితీరుపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సమాచారంతోపాటు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకుని అధికారికంగా పార్టీ వైఖరిని వెల్లడించాలని భావిస్తోంది. తద్వరా వరంగల్ డిక్లరేషన్‌కు అనుగుణంగా ముందుకెళ్లే దిశగా కార్యాచరణ మరింత ఉధృతం చేయాలని యోచిస్తోంది.
ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, మల్లురవి, ధరణి కమిటీ సభ్యులు హర్కర వేణుగోపాల్, ఈరవత్రి అనిల్, చెరుకు సుధాకర్, ప్రీతం తదితరులు హాజరయ్యారు.
గంటన్నరపాటు సమావేశమైన వీరు ధరణి పోర్టల్ వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కొనసాగించాలా లేదా కొత్త పద్ధతిలో తీసుకెళ్లాలా అనే దానిపై చర్చించారు. దీనిపై మండలానికి ఐదుగురిని నియమించి వారితో డేటా సేకరించాలని, ఆ తర్వాత 3వేల మందితో సమావేశం నిర్వహించి అందులో వెల్లడైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు.
మాది తోడికోడళ్ల పంచాయితీ: రేవంత్, జగ్గారెడ్డి
ధరణిపై సీఎల్పీలో జరిగిన సమావేశానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. తమది తోడికోడళ్ల పంచాయతీ అని, పొద్దున తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతామని చెప్పారు. రేవంత్ పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి దింపి పీసీసీ అధ్యక్షుడు కావాలన్నది తన అభిమతం కాదని స్పష్టంచేశారు. ఆయన దిగిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని పేర్కొన్నారు.
నాపై కుట్రలు కొత్త కాదు: దామోదర
నేను ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజిని ఎప్పుడూ కలవలేదు. ఎవరో కావాలని తనకు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలు నాకు కొత్తకాదు. గతంలోనూ చాలాసార్లు జరిగాయి.
కవిత, సంతోష్‌ను అరెస్టు చేయాలి: జగ్గారెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ నేరస్తులేనని... వారిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోశ్‌ను ముందుపెట్టి తెలంగాణలోని వివిధ పార్టీల నేతలను కొనేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఒక స్కీం అని, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలను బీజేపీలో చేర్చుకోవాలనుకోవడం ఒక స్కాం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment