తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు వేళయింది. బుధవారం (నవంబర్ 6) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేకు సంబంధించిన సమాచారం అందజేశారు. అయితే కులగణనలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ఉంటాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది.
సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే ప్రశ్నావళిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కుటుంబ వివరాలు.. అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాగా, సర్వేలో ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.
సర్వే జరిగేది ఇలా..
ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు.
పార్ట్-1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు లింగం, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్‌తో సహా 10 వివరాలు సేకరిస్తారు. కాగా, వీటన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
మొబైల్ నంబరు, వైకల్యం, వైవాహిక స్థితి, విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, ఐటీ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత క్రమంలో నమోదు చేస్తారు.
వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్‌బుక్ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాలు కూడా సేకరిస్తారు.
రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందివారా అనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తారు.
రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. వలస వెళ్లడానికి కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది.
గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే... ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు.
చివరగా ఎన్యుమరేటర్‌కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment