ఇంటింటికి వెళ్లనున్న ఎన్యుమరేటర్లు
వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక వివరాల సేకరణ
సర్వేలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు
175 కుటుంబాలు ఒక బ్లాకుగా వర్గీకరణ
ప్రతి పదిమంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడు
సేకరించిన సమాచారం వెంటనే కంప్యూటరీకరణ
ప్రణాళిక శాఖకు రోజువారీ పురోగతి నివేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం నుంచే ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరిగి కుటుంబాల సమగ్ర వివరాలను నమోదుచేస్తారు. ఈ సర్వేలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు.
ప్రతి పదిమంది ఎన్యుమ రేటర్లకు ఒక పరిశీలకుడు చొప్పున 850 మందిని ప్రభుత్వం నియమించింది. ఎన్యుమరేటర్లలో 32 వేల మంది టీచర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు, పరిశీలకులకు, పర్యవేక్షణ అధికారులకు విడతలవారీగా జిల్లా కలెక్టర్లు శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు మధ్యా హ్నం భోజనం తర్వాత సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. సర్వే ప్రక్రియలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందితోపాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్ టీచర్లను సైతం నియమించారు.
పూర్తి వివరాలు సేకరణ
ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం(పార్ట్–1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలుంటాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాసగృహం, తాగునీరు తదితర ప్రశ్నలు అడుగుతారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు.
175 కుటుంబాలు ఒక బ్లాకు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను సులభతరంగా చేపట్టేందుకు 175 ఇళ్లను ఒక బ్లాకుగా విభజించి ఎన్యుమరేటర్లకు కేటాయించారు. ఈ బ్లాకుల విభజన ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. సెన్సెస్ డైరెక్టర్ నుంచి ఎన్యు మరేషన్ బ్లాక్(ఈబీ) మ్యాపులు తీసుకుని బ్లాకులను విభ జించారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులోని ప్రతి ఇంటిని సర్వే చేయాలి. అనంతరం సర్వే పూర్తి చేసినట్లు స్టిక్కర్ అంటిస్తారు. ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వాటిని సూపర్‌వైజర్లు మరోమారు తనిఖీ చేసి ఎన్యుమరేటర్ పనితీరును అంచనా వేస్తారు.
చదవండి: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఈ వివరాలు తెలుసుకోండి
ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. సేకరించిన కుటుంబాల వివరాలను ఏ రోజుకారోజు కంప్యూటర్లలో ఎంట్రీ చేస్తారు. ఈ ఎంట్రీనే అత్యంత కీలం కానుంది. డేటా ఎంట్రీలో పొరపాట్లు దొర్లితే సర్వే స్వరూపం మారిపోతుంది. అందుకే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేకు ప్రతి జిల్లాలో నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. సర్వే నిర్వహణలో రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల లోపు పంపాలి. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆ మేరకు జిల్లా కలెక్టర్లు కార్యాచరణ సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment