సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్ కసరత్తు ప్రారంభించారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయిస్తున్నారు.
ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు వారంలోపే పూర్తవుతాయని.. ఆ తర్వాత ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో వస్తున్న ఇబ్బందుల్లో పదికిపైగా చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీసీఎల్‌ఏ వర్గాలు చెబుతున్నాయి.
చిన్నవే కానీ.. సతాయిస్తున్నాయి
వాస్తవానికి వ్యవసాయ భూముల లావాదేవీలు మాన్యువల్‌గా జరిగే సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినా పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించేవారు. కానీ ధరణి పోర్టల్ ఆన్‌లైన్ వేదిక కావడంతో ఏ చిన్న సమస్య అయినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకరీతిలో ఇబ్బందులు పెడుతోంది. దీనికితోడు భూసమస్యల పరిష్కార అధికారం కలెక్టర్ల చేతిలో ఉండటంతో మరింత జాప్యం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంలోనే అసలు సమస్య వచ్చిందనే నిర్ధారణకు వచ్చి ఆయా సమస్యల నివృత్తి, పరిష్కారానికి రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. తన వరకు వస్తున్న దరఖాస్తులు, విజ్ఞప్తులను అధ్యయనం చేయడంతోపాటు సీసీఎల్‌ఏ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా..
ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చిన్న సమస్యలు కూడా అగ్నిపరీక్షలుగా మారిపోయాయి. ముఖ్యంగా పట్టాదారు చనిపోయే సమయం నాటికి ఆ వ్యక్తి పేరిట ఉన్న భూమికి సంబంధించిన రికార్డులపై తహసీల్దార్ డిజిటల్ సంతకం లేకపోతే ఆ భూమిని చనిపోయిన పట్టాదారు వారసులకు బదిలీచేసే అవకాశం ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో అందుబాటులో లేదు.
అలాగే గతంలో నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు) భూములు ఇప్పటికీ ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల విభాగంలోనే కనిపిస్తున్నాయి. ఈ భూములను నాలా కింద మార్పు చేసే ఆప్షన్ కూడా ధరణిలో లేదు. గతంలో కంపెనీలు, ట్రస్టుల పేర్లపై ఉన్న భూముల వివరాలు ధరణిలో సక్రమంగా అప్‌లోడ్ కాకపోవడంతో వాటి పాసుపుస్తకాలు ఆయా కంపెనీలు, ట్రస్టుల పేరిట రావట్లేదు.
ఇలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపగా ఇందుకు సంబంధించిన మార్పులు వారం రోజులు లోపే ధరణిలో కనిపించనున్నాయి. మరోవైపు మరికొన్ని సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించారు.
మిస్సింగ్‌కు మిత్తల్ ‘మార్కు’
ధరణిలో ఎదురవుతున్న మరో సమస్య మిస్సింగ్ సర్వేనంబర్లు. రెవెన్యూ ఆన్‌లైన్ రికార్డుల్లో కొన్ని సర్వేనంబర్లు మిస్సవడంతో ఈ సర్వే నంబర్లలోని భూముల రైతులు పాసు పుస్తకాలు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు అందక ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ధరణిలో మిస్సింగ్ సర్వేనంబర్ల నమోదు కోసం సీసీఎల్‌ఏ ప్రత్యేక ఆప్షన్ కల్పించారు. టీఎం–33 కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన సర్వేనంబర్లను పోర్టల్‌లో సరిచేస్తున్నారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్న నేపథ్యంలో రోజుకు 500 చొప్పున దరఖాస్తులను పరిష్కరించేందుకు సీసీఎల్‌ఏ కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment