
నడిగూడెంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న షర్మిల
కోదాడ: తెలంగాణలో ధరణి పేరుతో పేదల భూములను తారుమారు చేశారని, ప్రజలకు తమ భూముల కోసం అధికా రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ధరణి పోర్టల్‌ను బాగు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడి గూడెం మండల కేంద్రంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యమని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గత 8 ఏళ్లలో ప్రజలను మోసం చేశారని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. వేల కోట్ల కమీషన్లు తీసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో డబ్బులు బాగా పంచుతారని, అవి మనడబ్బులే కాబట్టి నిర్భయంగా తీసుకొని ప్రజల గురించి ఆలోచించే వైఎస్సార్‌టీపీని ఆదరించాలని ఆమె కోరారు. ఇంట్లో ఎందరు వృద్ధులు ఉంటే అందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిట్టా రామిరెడ్డి, పచ్చిపాల వేణుయాదవ్, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, మాదాసు ఉపేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment