
సాక్షి, హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఉంది ధరణి పోర్టల్ పరిస్థితి. రాష్ట్ర రైతాంగానికి మింగుడు పడని ఈ ధరణి పోర్టల్ సిత్రాలకు అంతులేకుండా పోతోంది. తప్పుల మీద తప్పులు, అర్థం లేని ఆప్షన్లు, రెవెన్యూ వాడుకలో లేని పదాలకు ఈ పోర్టల్ నెలవుగా మారుతోంది. రైతుల పాస్‌బుక్కుల్లో తప్పుల సవరణల కోసం ప్రభుత్వం ఇచ్చిన తాజా మాడ్యూల్ అభాసు పాలవుతోంది. పాస్‌బుక్కులో నమోదైన మొత్తం 11 రకాల తప్పుల సవరణల కోసం ఇచ్చిన మాడ్యూల్‌లోని మూడు రకాల ఆప్షన్లను పరిశీలిస్తేనే 100కు పైగా తప్పులు తేలడం గమనార్హం. కాగా మిగిలిన 8 రకాల ఆప్షన్లు చూస్తే ఇంకెన్ని తప్పులు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొత్త మాడ్యూల్‌లో ఇచ్చిన ఆప్షన్లు, కేటగిరీలు చూసి రెవెన్యూ వర్గాలే విస్తుపోతుండటం గమనార్హం.
హమ్మయ్యా అనుకునే లోపే..
పాస్‌బుక్కుల్లో నమోదైన తప్పులను సవరించుకునేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశమివ్వాలనే డిమాండ్ రైతుల నుంచి చాలా కాలంగా ఉంది. ఎట్టకేలకు దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవలే కొత్త మాడ్యూల్‌ను ధరణిలో ప్రవేశపెట్టింది. ఈ మాడ్యూల్ ప్రకారం పాస్‌బుక్‌లో నమోదైన 11 రకాల తప్పులను సరిచేసుకోవచ్చు. ఈ తప్పుల సవరణల కోసం ధరణి పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత సర్వే నంబర్, ఖాతా నంబర్, పాస్‌బుక్ నంబర్లను నమోదు చేస్తే.. ప్రస్తుతం ఆ పాస్‌బుక్‌లో ఉన్న వివరాలతో పాటు ఎక్కడ తప్పులు దొరా>్లయో సరిదిద్దుకునే ఆప్షన్లు ఉంటాయి. అయితే ఇందులో వ్యాకరణ, అనువాద, అక్షర దోషాలతో పాటు అర్థం లేని ఆప్షన్లు ఇవ్వడంతో రైతులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
అంతుబట్టని ఆప్షన్లు..కేటగిరీలు
సర్వే..సరిహద్దుల చట్టం, ఆర్‌ఓఆర్ వంటి చట్టాలు, ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొన్న కేటగిరీలు, రెవెన్యూ పదాలను మాత్రమే పాస్‌పుస్తకాల్లో ఉపయోగించాలి. కానీ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో పెట్టిన ఈ ఆప్షన్లు, కేటగిరీలు, పదాలు మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. దీనిపై రెవెన్యూలోని సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గ్రామాల్లో నాలుగైదేళ్లు వీఆర్వోగా పనిచేసిన వారిని అడిగినా ధరణి పోర్టల్‌లో పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణ కోసం ఏం ఆప్షన్లు ఇవ్వాలో చెప్తాడని, తాజా మాడ్యూల్‌ను చూస్తే రెవెన్యూ వర్గాలపై కాకుండా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై ఆధారపడి రూపొందించినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
పడావు అంటే పడవ అంట!
‘పడావు భూమి’అంటే సాగుచేయని భూమి అని అర్థం... దీన్ని ఇంగ్లిషులో రాయాలంటే ‘నాన్ కల్టివేటెడ్’అని రాయొచ్చు... కానీ ధరణి వెబ్‌సైట్‌లో మాత్రం ‘పడావు’అనే పదాన్ని పడవ అనుకుని ‘బోట్’అని రాశారు.
స్కూల్ అంటే తెలుగులో పాఠశాల లేదా బడి అని రాయొచ్చు. కానీ ధరణిలో రెండు ఆప్షన్లు ఇచ్చి ఒకచోట బడి అని మరోచోట పాఠశాల అని రాశారు.
–పో.పట్టా అనే పదం రెవెన్యూ భాషలోనే లేదు. కానీ ధరణి వెబ్‌సైట్‌లో మాత్రం ఇంగ్లిషు, తెలుగులో కనిపిస్తోంది. పాస్‌బుక్కులో ఎక్కడా అవసరం లేని మూసీ కాలువ అనే ఆప్షన్ కూడా కనిపిస్తోంది.
–అటు సామాన్య రైతులకు కానీ, ఇటు మీసేవా ఆపరేటర్లకు కానీ అర్థం కాని ఎల్‌టీఆర్‌కేకే, ఎల్‌టీఆర్‌టీ, టీజీఎంఎస్, ఇన్‌హెరిటెడ్ ఇన్‌హెరిటెన్స్, పంజా, ప్ర.భూమి, టెనెన్సీపట్, గాయిరాన్, గెరాన్, చొత ఇనాం, దస్తగర్ద ఇనాం, దస్త్ గర్దా ఇనాం లాంటి పదాలకు ధరణి పోర్టల్‌లో కొదవే లేదు.
భూదాన్ పట్టా అంటే భూటాన్ గ్రాడ్యుయేటెడ్ అంట!
–ఆబాది అనే పదం ఎన్నిరకా>లుగా మారిందో తెలుసా... దీని కోసం ఆరు ఆప్షన్లు ఇచ్చి ఆబాది, అభి/అభి, అబి.దో.పస్లా, అబి.ఎక్.పస్లా, అబి/తాబి అని వెబ్‌సైట్‌లో పెట్టి మీ భూమి ఏ రకమో టిక్ పెట్టాలని అడగడం ధరణికి మాత్రమే చెల్లింది.
– అసురఖన, తరి–తాభి, ఎక్ పస్లా, ఖరాజు ఖాతా, షికం ప్రాజెక్టు, బ.హీ.ఇండ్లు, బోనవాకన్సియా లాంటి అర్థం కాని భాషల్లో ఉన్న పదాలన్నీ ధరణి పోర్టల్‌లో పొందుపరిచారు.
–మరిది కుమారుడు (అండ్ ద అదర్ సన్), పసుపు కుంకుమ (ఎల్లో శాఫ్రాన్), గుడి (డ్రింకింగ్), అధిగ్రహణ భూములు (ఎక్స్‌ట్రార్డినరీ ల్యాండ్స్), తమ్ముని భార్య (బ్రదర్స్ బ్రదర్), భూదాన్ పట్టా (భూటాన్ గ్రాడ్యుయేటెడ్), పెద్దనానా (బిగ్ నానా) అంటూ చేసిన అనువాదం చూసి రెవెన్యూ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.
Comments
Please login to add a commentAdd a comment