ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి
బొమ్మరాశిపేటలో ధరణి కమిటీ సభ్యుల పర్యటన
శామీర్‌పేట్: కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి పోర్టల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ ధరణి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని బొమ్మరాశిపేట గ్రామంలో ధరణి కమిటీ సభ్యులు పర్యటించారు.
అనంతరం బొమ్మరాశిపేట రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కోదండరెడ్డి, ధరణి కమిటీ న్యాయ సలహాదారు సునీల్‌లు మాట్లాడుతూ.. బొమ్మరాశిపేట గ్రామంలో ధరణిలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, బడా బాబులు కుమ్మక్కై భూ సమస్యలను సృష్టించినట్లు గుర్తించామని తెలిపారు.
ధరణిలో ఉన్న లోపాలను గుర్తించేందుకు బొమ్మరాశిపేట గ్రామంలో నెలకొన్న భూ సమస్యను ఓ కేస్ స్టడీగా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో మార్పులు చేపట్టి, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తామని అన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, త్వరలోనే ప్రభుత్వం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని వారు భరోసా ఇచ్చారు.
లొసుగులను వాడుకొని..
ధరణిలో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు బడాబాబులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొమ్మరాశిపేట రైతులు ధరణి కమిటీ సభ్యుల ముందు వాపోయారు. 50 ఏళ్ల క్రితం 1,050 ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగుచేస్తున్నామని, ఇటీవల కొందరు వ్యక్తులు వచ్చి ఆ భూమి తమదంటూ.. అధికారులతో కుమ్మక్కై భూములను బ్లాక్ లిస్ట్‌లో చేర్పించారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
తమ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని, కొంత స్థలం అమ్మి కూతుళ్ల పెళ్లిచేయాలని ప్రయత్నించినా ధరణి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment