సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్‌లో జరుగుతున్న అక్రమాలను వివరించారు.
కాగా, రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. రాత్రిపూట ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. దీని వెనుక పెద్ద మాఫియా దాగుంది.. దీనిపై ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతాం. ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉంది. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరుగుతోంది. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి.
ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరం. గజ్వేల్‌లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం గుంజుకుంది. అమూల్ డైరీకి వందల ఎకరాల కట్టబెట్టారు. గంగుల కమలాకర్‌కు భూములు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారు. పూర్వీకులంతా భూకంపం వచ్చినట్లు.. సర్వం కోల్పోయినట్లు.. కేటీఆర్, కేసీఆర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. పరోక్షంగా వారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒప్పుకున్నారు. మీ చీకటి నేర సామ్రాజ్యంలో వ్యక్తుల ఒప్పందాలతో మీకు ఆర్థిక ప్రమాదం ఉందో.. ప్రాణ భయం ఉందో తెలియడంలేదు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు.
ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. కిషన్‌రెడ్డి.. కేసీఆర్ ధరణి దోపిడీలపై స్పందించాలి. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ,బీఆర్‌ఎస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపాం. పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.
రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ మోసం చేసింది. రాజేందర్‌కు భద్రత పెంచినా.. అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు?. నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజేందర్ అన్నకు భద్రత ఏర్పాటు చేయడం సంతోషం అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ!
Comments
Please login to add a commentAdd a comment