సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను బరాబర్ రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గడీల పాలన పునరుద్ధరణ కోసమే కేసీఆర్ ధరణిని తీసుకువచ్చారని, ఈ పోర్టల్ ద్వారా బినామీల పేరిట వేల ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. ‘కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణిని తెచ్చారు. 97 శాతం భూ వివాదాలకు ధరణి పోర్టలే కారణం. దీనిని ఇచ్చి న మాట ప్రకారం కచ్చి తంగా రద్దు చేస్తాం’అని ప్రకటించారు.
యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం కత్రియా హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ కారణంగా ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిందని, ధరణిలో అవకతవకలకు కారణమైన అధికారులు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు.
‘ధరణి రాకముందు రైతుబంధు రాలేదా? భూముల రికార్డులు లేవా? ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం వస్తోంది?’అని ప్రశ్నించారు. ధరణి విషయంలో కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి కోసం చర్లపల్లి జైల్లో డబుల్‌బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని రేవంత్ పేర్కొన్నారు.
యువత ముందుండాలి: రాష్ట్రంలో కేసీఆర్‌పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యూత్ కాంగ్రెస్ శ్రమించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చి న పార్టీగా ఒక్క అవకాశాన్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు. పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న విడుదల చేస్తామని చెప్పారు.
దేశంలో డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని, దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజిన్ పని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రద్దయిన వెయ్యినోటు లాంటి వారయితే, మోదీ.. వెనక్కు తీసుకున్న రెండు వేల రూపాయల నోటు లాంటివారని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్‌లను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీలంగా పనిచేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు.
చర్చకు మేం సిద్ధం: ఈ సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, అంతకుముందు జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని రేవంత్ అన్నారు. ‘2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై చర్చకు కేటీఆర్, హరీశ్‌లు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ చేయనిది ఏదైనా బీఆర్‌ఎస్ చేసి ఉండే క్షమాపణలు చెప్పడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ‘కాంగ్రెస్ ఏం చేసిందని తండ్రీ కొడుకులు అడుగుతున్నారు. కేసీఆర్‌లా మేం రాష్ట్రాన్ని కొల్లగొట్టం. ప్రజలు ఎవరిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో త్వరలోనే తెలుస్తుంది’అని వ్యాఖ్యానించారు.
డీకే అరుణ బీజేపీ అధ్యక్షురాలయితే మంచిదే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ మంత్రి డి.కె.అరుణను నియమిస్తే మంచిదేనని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీని కూడా కాంగ్రెస్ వాళ్లే నడిపిస్తున్నట్టు అవుతుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అరుణని అధ్యక్షురాలిగా నియమిస్తే బీజేపీని నడిపే బలం ఆ పార్టీ వాళ్లకి లేదని ఒప్పుకున్నట్టే అవుతుందని చెప్పారు.
తెలంగాణలో ఏముందని షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, పొత్తులయినా, టికెట్లయినా పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న మంత్రి కేటీఆర్ ప్రశ్నకు స్పందిస్తూ.. తమ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో చెపితే బీఆర్‌ఎస్ దుకాణాన్ని బంద్ చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment