
రోడ్డుషోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం భూములు ఇస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం దరిద్రపు ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఆ భూములను బలవంతంగా గుంజుకోవాలని చూ స్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘మన మునుగోడు–మన కాంగ్రెస్’రచ్చబండలో భాగంగా యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం బోటిమీది తండాలో ఆదివారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ హయాంలో ఇక్కడి గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలని 2 వేల ఎకరాల భూములు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే.. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఎకరం భూమి కానీ, ఉద్యోగం, ఇళ్లు, పింఛన్లు కానీ ఇచ్చాయా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కొత్తవి కాదని, కొత్త సీసాలో పాత సారా వంటివని విమర్శించారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ఏం ఎలగబెట్టాడని నిలదీశారు.
చెవుల్లో పువ్వు పెట్టడానికి వస్తున్నాడు
రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా కాంగ్రెస్ గెలిపిస్తే, ఇప్పుడు పువ్వు గుర్తు పట్టుకొని మన చెవుల్లో పువ్వు పెట్టడానికి వస్తున్నాడని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ఆభ్యర్థి స్రవంతిని గెలిపిస్తే పీఎం మోదీని, సీఎం కేసీఆర్‌ను చొక్కా పట్టుకొని గిరిజనులకు పట్టాలు ఇప్పిస్తారని, ఇళ్లు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. మునుగోడు సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ గడీల దొరల పార్టీ కాదని, గిరిజనుల పార్టీ అని పేర్కొన్నారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, పార్టీ మండల ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, చల్లమళ్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్న కైలాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment