సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నుంచి 76 మంది ఎస్టీ రైతుల పేర్లను తొలగించడంపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు కామారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించింది. నివేదిక ఇవ్వనిపక్షంలో కలెక్టర్, కామారెడ్డి ఆర్డీవో కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. యాచారం మండలంలోని తమ భూముల వివరాలను ధరణి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ భూపల్లి సాయిలు, మరో 75 మంది హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘యాచారం మండలం సజ్యా నాయక్ తండా, పుర్యా నాయక్ తండా, గాంధారి ఉట్నార్, లక్ష్మి నాయక్ తండా తదితర ప్రాంతాలకు చెందిన పేద ఎస్టీ కుటుంబాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర ఎకరం నుంచి 3 ఎకరాల వరకు భూమి పంపిణీ చేసింది.
వీరందరికీ తెలంగాణ ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేయడమే కాదు.. రైతుబంధు కూడా ఇస్తోంది. ఇటీవల కారణాలు చెప్పకుండా వీరందరి పేర్లను ధరణి నుంచి తొలగించారు. దీంతో రైతుబంధు సహా ఇతర ఆర్థికపరమైన సాయాన్ని పొందలేకపోతున్నారు’అని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఏళ్ల క్రితం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సాధ్యపడదు. ధరణి పోర్టల్ నుంచి రైతుల వివరాలు తొలగించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. ఇష్టం వచ్చినట్లు తొలగించడం సరికాదు. కోర్టు చెప్పే వరకు ఆయా భూముల నుంచి వారి వెళ్లగొట్టకూడదు’అని ఆదేశించారు. అనంతరం విచారణను జూలై 15కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment