ఎట్టకేలకు కదిలారు..! | the High Court ruled that the place belongs to market | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కదిలారు..!

Published Wed, Dec 3 2014 12:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

the High Court ruled that the place belongs to market

వికారాబాద్: ఎట్టకేలకు పట్టణంలోని మార్కెట్ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 30 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై గతంలో వివాదాలు కొనసాగాయి. అయితే ఈ స్థలం మార్కెట్‌దేనని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఏడాది తర్వాత కదిలిన అధికారులు మంగళవారం ఆ భూమిలోని డబ్బాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

ఇది వివాదం..

వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ కార్యాలయం పరిధిలో సర్వేనంబర్ 131లో 5.31 ఎకరాల భూమి ఉండేది. అయితే గతంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆదాయ నిమిత్తం అందులో కొంత భూమిని అమ్మగా ఇంకా 10 వేల గజాల స్థలం మిగిలింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి విలువ రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు పలుకుతోంది. అయితే ఈ స్థలంలో కొందరు డబ్బాలు పెట్టుకొని వ్యాపారాలు ప్రారంభించారు. కాగా కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని కాజేయడానికి కావాలనే కొందరు బడా వ్యక్తులు తమకు అనుకూలంగా ఉన్న వారితో ఇక్కడ చిరు వ్యాపారాలను ఏర్పాటు చేయించారనే ఆరోపణలున్నాయి.

ఈక్రమంలో ఈ స్థలంలో తాము ఎప్పటినుంచో ఉంటుంన్నందునా క్రమబద్ధీకరించాలని సదరు చిరువ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ స్థలం మార్కెట్ కార్యాలయందంటూ అధికారులు కోర్టునుఆశ్రయించారు. కొంతకాలంపాటు వాదోపవాదనలు సాగిన తర్వాత కోర్టు నిర్ణయం మార్కెట్ కార్యాలయానికి అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ ఆ స్థలం జోలికి అటు అధికారులుగాని ఇటు ప్రజాప్రతినిధులుగాని వెళ్లేవారు కాదు. అనధికారికంగా చిరువ్యాపారుల నుంచి కిరాయి కూడా వసూలు చేసేవారు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. ఎట్టకేలకు కదిలిన అధికారులు మంగళవారం పోలీసుల సాయంతో ఆ స్థలంలోని అక్రమ కట్టడాలను తొలగింపజేశారు.

మార్కెట్ స్థలంలోని కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులను చిరువ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఈ స్థలంలో 10 దుకాణాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 40 లక్షల నిధులు మంజూరు చేసిందని, ఈ దుకాణాల కేటాయింపు మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తామని అధికారులు చిరువ్యాపారులకు నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన ముగించారు. అనంతరం జేసీబీల సాయంతో కట్టడాల తొలగింపు కొనసాగింది. డీఎస్పీ టి.స్వామి, సీఐలు రవి, లచ్చీరాంనాయక్ పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement