రేపటి నుంచి ఫ్లెక్సీల నిషేధం
నల్లగొండ, నల్లగొండ టూటౌన్ :మున్సిపల్ పట్టణాల్లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జనవరి ఒకటవ తేదీ నుంచి నల్లగొండ పట్టణంలో దానిని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టొద్దని, నిబందనలు అతిక్రమిస్తే జరిమానాతో పా టు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాజకీయ నాయకులు సహకరించాలి : జేసీ
ఫ్లెక్సీల నిషేధంపై రాజకీయ నాయకులు సహక రించాలని జేసీ నారాయణరెడ్డి కోరారు. శుక్రవా రం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలోనూ ఫ్లెక్సీలు పెట్టవద్దన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే నిర్వహించి ఆర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 900 మరుగుదొడ్లు ప్రారంభిం చామని, పనులు కొనసాగుతున్నాయని, నాలుగైదు రోజుల్లో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు లేని మరుగుదొడ్లు 1200 ఉన్నాయన్నారు. సెప్టిక్ ట్యాంకులు నిర్మిం చుకుంటే ప్రభుత్వం రూ.7 వేలు ఇస్తుందని తెలి పారు.
ఇందుకు జనవరి 5వ తేదీలోగా ఆధార్ జీరాక్స్ ప్రతితో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోకుంటే ఫిబ్రవరి నెల నుంచి తాత్కాలికంగా రేషన్ సరుకులు నిలిపి వేస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సర్టిఫికెట్ వారం రోజుల్లోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వవద్దని కోరారు. డబ్బులు అడిగితే వాట్సాప్ నంబర్ 9000020 940కు సమాచారం అందించాలని కోరారు. నేటితో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు గడువు ముగియనుందని, ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే శనివారంలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అరుణకుమార్ చరణ్, డీఈ వెం కటేశ్వర్లు, ఏసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు.