శ్రీకాళహస్తిలో ఫ్లెక్సీల గొడవ
- మున్సిపల్ కార్యాలయంపై కోలా వర్గీయుల దాడి
- చైర్మన్ ఇంటి వద్ద కౌన్సిలర్ల ధర్నా
శ్రీకాళహస్తి : పట్టణంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ కోలా ఆనంద్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. ఈ వివాదం మున్సిపల్ కార్యాలయంపై దాడికి దారితీసింది. కోలా ఆనంద్ జన్మదినం సందర్భంగా శనివారం పట్టణంలో పలుచోట్ల ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది శనివారం రాత్రి వాటిని తొలగించారు. దాంతో ఆనంద్ వర్గీయులు శనివారం రాత్రి 7.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంపై దాడిచేశారు. కార్యాలయంలో పలుచోట్ల అద్దాలు పగులగొట్టారు.
అక్కడే బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్లు ముగ్గురు గాయపడ్డారు. అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డిని, కమిషనర్‌ను ఫ్లెక్సీల తొలగింపుపై నిలదీశారు. చైర్మన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు నచ్చజెప్పి ఆందోళనకారులను పంపేశారు. అయితే చైర్మన్ ఇంటిపై దాడిచేశారంటూ కౌన్సిలర్లు కొంతమంది రాత్రి 9గంటలకు ధర్నా చేపట్టారు.