♦ 22 వరకు కొనసాగింపు అందరూ భాగస్వాములు కావాలి
♦ 28 లక్షల పెరటి మొక్కలు నాటించాలి నేటి నుంచి గ్రామసభలు
♦ నూరు శాతం మరుగుదొడ్లు నిర్మిస్తే పురస్కారం
♦ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.యోగితారాణా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, అన్ని రంగాల్లో ముందున్న జిల్లా హరితహారంలో ఆదర్శం కావాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు పిలుపునిచ్చారు. ఈనెల 8న అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ప్రాంతాలలో ఇంటికి ఐదు చొప్పున పెరటి మొక్కలు నాటించాలని ఆమె ఆదేశించారు. ఈనెల 8 నుంచి 22 వరకు హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలులో చేంజ్ ఏజెంట్లకు సహకరించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి గ్రామాన్ని, మున్సిపాలిటీని, ఖాళీ ప్రదేశాలను హరితమయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.
సోమవారం కలెక్టరేట్ నుంచి మండల చేంజ్ ఏజెంట్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యాచరణ అమలుకు ఈనెల 5 అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రామజ్యోతి సభ్యులు, గ్రామ సంఘాలను గ్రామ సభలలో భాగస్వాములను చేసి, ప్రతి ఇంట మొక్కలు నాటేందుకు ఆయా కుటుంబాలను సన్నద్ధం చేయాలని సూచించారు. ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా 28 లక్షల మొక్కలను ఇంటింటా నాటించాలని స్పష్టం చేశారు. పెరటి మొక్కలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, సంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థల ఆవరణలలో 13 లక్షల మొక్కలను నాటించాలని తెలిపారు.
హరితహారం కింద ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలను సరఫరా చేసేందుకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీపంలోని నర్సరీల నుండి ఆయా గ్రామ పంచాయతీలకు మొక్కలను కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో పొలాల గట్లు, కంచెల వద్ద 1.35 కోట్ల మొక్కలను ఈనెల 17లోపు నాటించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. మిగిలిన ప్రాంతాలలో 1.56 కోట్ల మొక్కలను నాటించేందుకు గుంతలను తవ్వించాలని తెలిపారు.
అపరిశుభ్రతను రూపుమాపాలి
మన దేశంలో సంభవిస్తున్న 10 మరణాల్లో ఒక మరణం పారిశుధ్య లోపం వల్లనే జరుగుతున్నదని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అభిప్రాయపడినారు. అపరిశుభ్రత వల్ల తల్లి, పిల్లలలో ఏర్పడే నులి పురుగులు వల్ల వారి ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యతను గుర్తించేంసేందుకు ప్రతి అంగన్‌వాడి కేంద్రంలో మూడు గోడ పత్రికలు ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. వాటితోపాటు నులిపురుగులు, నట్టలు సేకరించి ప్లాస్టిక్ సిసాలో ఉంచి గ్రామస్తులను చైతన్యపర్చాలన్నారు.
మహాత్మాగాంధీ జయంతి అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్ఛ నిజామాబాద్‌గా ప్రకటించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలో మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఈనెల 31లోపు నూరు శాతం పూర్తి చేయించాలని తెలిపారు. అలాగే పల్లె ప్రగతి(టీఆర్‌ఐజీపీ) మండలాలైన తాడ్వాయి, గాంధారి, మాచారెడ్డి, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఆగస్టు 31లోపు మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ముందున్న మండలాలకు ఆగస్టు 15న పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా/పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ/పీడీ చంద్రమోహన్‌రెడ్డి, డీఎఫ్‌ఓ సోషల్ ఫారెస్టు సుజాత, జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.