హరితహారాన్ని పూర్తిచేయాలి
-
శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
-
కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. హన్మ కొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం రాత్రి వివిధ శాఖల అధికారులతో హరితహారం కార్యక్రమం ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీరోజు లక్ష్యాన్ని ఎంచుకుని మొక్కలను నాటాలన్నారు. రాష్ట్రస్థాయి అధికారుల నుంచి అందిన నమూనా ప్రకారం నివేదిక సమర్పించాలని సూచించారు. పండ్ల మొక్కలకు సంబంధించిన టెండర్ పూర్తయిందని, ఈనెల 30 నుంచి సరఫరా జరుగుతుందన్నారు.
డీ గ్రేడెడ్ ఫారెస్టులో విరివిగా మొక్కలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ సంరక్షణ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారానికి సంబంధించిన మొక్కలతో కూడిన వనాలను పెంచాలని సూచించారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, దేవాదాయశాఖ, విద్యాశాఖ, డ్వామా, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
లక్ష్యాన్ని చేరుకోవాలి
హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో హరితహారం కార్యక్రమంపై కలెక్టర్ కరుణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ పాంట్లేషన్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సోషల్ ఫారెస్టు డీఎఫ్‌ఓ శ్రీనివాస్, సీపీఓ రాంచంద్రరావు, డీఆర్‌ఓ శోభ, పీఓ ఐటీడీఏ అమయ్‌కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.