ప్రక్షాళన షురూ...!
సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రక్షాళన మొదలైంది. బల్దియాపై ప్రత్యేక దృష్టిసారించిన కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం ఉదయం 6 గంటలకే మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ వెంటనే శుక్రవారం ఏకంగా ఇన్‌చార్జ్ కమిషనర్‌నే మార్చి కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు పంపారు.
సంగారెడ్డి బల్దియాపై కలెక్టర్ నజర్
- మొన్న తనిఖీలు.. నిన్న కమిషనర్ మార్పు
- ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య నలిగిపోతున్న అధికారులు
అవినీతి అక్రమాలకు సంగారెడ్డి మున్సిపాలిటీ కేరాఫ్‌గా మారింది. ఇవే ఆరోపణలపై గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు సస్పెండ్ కాగా కొంత మంది జైలుకు సైతం వెళ్లారు. కాగా మున్సిపల్ పాలక వర్గంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ వారు ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పనులు పూర్తిచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరుణంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై మున్సిపల్ నిధులను కొల్లగొడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై దృష్టిసారించాలని మంత్రి హరీష్‌రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దిశగా ఎవరూ ప్రయత్నించలేదు.
ఈ నేపథ్యంలో కమిషనర్‌ను తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించేందుకు అధికార టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి హరీష్‌రావుకు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మేనకొడలు సర్వే సంగీతను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా తీసుకొచ్చారు. కానీ మున్సిపల్‌లో జరుగుతున్న అక్రమాలు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయోనన్న భావనతో ఆమె బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సెలవుపై వెళ్లింది. దీంతో తిరిగి మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ గయాసొద్దీన్‌ను ఇన్‌చార్జ్ కమిషనర్‌గా నియమించారు.
పట్టుకోసం ప్రయత్నం..
కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్న మున్సిపాలిటీపై పట్టుసాధించేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కలెక్టర్‌గా రోనాల్డ్ రాస్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేకంగా మున్సిపల్‌పై దృష్టిసారించాలని కోరినట్లు తెలిసింది. అలాగే పట్టణాభివృద్ధిపై దృష్టిసారించాలని మంత్రి సైతం ఆదేశించినట్లు వినికిడి. దీంతో మున్సిపాలిటీని గాడిలో పెట్టేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే కమిషనర్ మా ర్పు అని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలి
మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ రెగ్యులర్ కమిషనర్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధికి సహకరించాలి. నిబంధనల మేరకు, సభ్యుల అమోదంతోనే పనులు నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల మార్పుతో పనులకు ఆటంకం కలుగుతుందని తప్ప ప్రయోజనం లేదు. అధికారంలో ఉన్నవారు ఉనికి కోస అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదు.
- విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్