అవినీతి నిర్మూలన అందరి బాధ్యత
అవినీతి నిర్మూలన అందరి బాధ్యత
Published Fri, Dec 9 2016 9:04 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
–అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపునిచ్చారు. మానవ జీవితంలో పెనవేసుకున్న అవినీతి మహమ్మారిని కూకటివేళ్లతో నిర్మూలించకపోయినా పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన చట్టాల పరిమితి నుంచే అవినీతి పుట్టుకొస్తుందని, చట్టాల పరిమితిని సడలిస్తే అవినీతి తగ్గే అవకాశం ఉందన్నారు. ఆధునాతన సంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా అవినీతిని అంతమొందించవచ్చన్నారు. ఉదాహరణకు.. చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండటం వల్ల 2లక్షల కార్డుల రేషన్ ఆదా అవుతుందన్నారు. నగదు రహిత లవాదేవీల వల్ల కూడా అవినీతి తగ్గుతుందని వివరించారు. వివిధ ఉత్పత్తులపై విధించే అధిక పన్నుల వల్ల కూడా అవినీతి పెరుగుతోందని, పన్నులు తగ్గిస్తే అవినీతిని తగ్గించవచ్చన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాల్లో అంశంగా చేర్చాలన్నారు. డెన్మార్క్‌లో అవినీతి తక్కువగాను, సోమాలియా, నార్త్ కొరియాల్లో ఎక్కువగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని వివరించారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని.. విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా అవినీతి నిర్మూలనకు జవాబుదారీతనంతో కృషి చేస్తామని అందరి చేత కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement