– నిధుల రికవరీకి ఆదేశం
– డ్వామా పీడీ నాగభూషణం వెల్లడి
మడకశిర : రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌లో జరిగిన అవినీతిపై కలెక్టర్ కోన శశిధర్ సీరియస్‌గా ఉన్నట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ నాగభూషణం తెలిపారు. ఆయన శుక్రవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక ఏపీడీ విశ్వనాథ్‌తో సమావేశమై రత్నగిరి మెగా వాటర్‌షెడ్ అవినీతిపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మెగా వాటర్‌షెడ్‌లో రూ.79 లక్షల అవినీతి జరిగినట్లు తెలిపారు. బాధ్యులైన వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. దుర్వినియోగమైన నిధులను పూర్తి స్థాయిలో రికవరీ చేస్తామని తెలిపారు. పని చేయకుండానే నిధులను స్వాహా చేశారన్నారు. కూలీలతో కాకుండా యంత్రాలతో పనులు చేపట్టారని చెప్పారు. పోస్టల్ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. ఈ వాటర్‌షెడ్ అవినీతిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంతటివారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు.
పని కల్పించిన సిబ్బందికే వేతనాలు
జిల్లావ్యాప్తంగా కూలీలకు పనులు కల్పించిన ఉపాధి హామీ సిబ్బందికి మాత్రమే వేతనాలు చెల్లిస్తామని డ్వామా పీడీ తెలిపారు. జిల్లాలోని 12 పంచాయతీల్లో పనులు కల్పించని 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించామన్నారు. అలాగే తక్కువగా పనులు చూపిన 171 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. ఖాళీగా ఉన్న 121 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 పనిదినాలు పూర్తి చేసిన వారిని జన్మభూమి కమిటీ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసి పంపితే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఏడో తరగతి పాసైతే చాలన్నారు. జిల్లాకు కోటి పనిదినాలను అదనంగా ఇచ్చారని, ఇందులో మార్చిలోగా 50 లక్షల పనిదినాలను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
రత్నగిరి వాటర్‌షెడ్ అవినీతిపై కలెక్టర్ సీరియస్
Published Fri, Feb 10 2017 10:10 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement