rathnagiri watershed
-
‘రత్నగిరి’ అక్రమాలపై కొరడా
- బ్లాక్ లిస్ట్‌లో ‘ఫోర్డ్’! – స్వచ్ఛంద సంస్థ అక్రమాలకు చెక్ – రావుడి వాటర్‌షెడ్ ప్రాజెక్టు రద్దు – ‘రత్నగిరి’లో రూ.79 లక్షల రికవరీకి నిర్ణయం – కలెక్టర్ కోన శశిధర్ వద్దకు ఫైల్ – ‘అవినీతి’పై వరుస కథనాలిచ్చిన ‘సాక్షి’ అనంతపురం టౌన్ : వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న వాటర్‌షెడ్ పథకంలో అక్రమాలకు పాల్పడిన ‘ఫోర్డ్’ స్వచ్ఛంద సంస్థపై వేటు పడింది. భారీఎత్తున దోపిడీకి పాల్పడినట్లు రుజువు కావడంతో ఈ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. 2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్ కింద రొళ్ల మండలంలో రత్నగిరి మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని పరిధిలో రత్నగిరి, కాకి, దొడ్డెరి, గుడ్డిగుర్కి పంచాయతీలు (మైక్రో వాటర్షెడ్లు) ఉన్నాయి. వీటిలోని 4,104 హెక్టార్ల విస్తీర్ణంలో జలసంరక్షణ పనులు చేపట్టేందుకు రూ.4కోట్ల 92 లక్షల 98 వేలతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఏడేళ్ల వ్యవధిలో ఈ నాలుగు మైక్రో వాటర్షెడ్ల పరిధిలో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే.. ‘ఫోర్డ్’ సంస్థ భారీఎత్తున అక్రమాలకు పాల్పడింది. అక్రమాలపై కలెక్టర్ కన్నెర్ర రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ కోన శశిధర్ కన్నెర్ర చేశారు. ప్రాజెక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ బదరీశ్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్ ఇంజినీర్లు, సిబ్బంది బాలాజీ, మహాలింగప్ప, నరసింహమూర్తిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. రూ.79 లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ఫోర్డ్’ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపారు. అక్కడి నుంచి రాగానే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు పంపనున్నారు. రావుడి వాటర్‌షెడ్ ప్రాజెక్టు రద్దు 2014–15 బ్యాచ్ కింద ‘ఫోర్డ్’ సంస్థకు అగళి మండలంలో ‘రావుడి’ వాటర్‌షెడ్ ప్రాజెక్టు మంజూరైంది. 2,550 హెక్టార్ల పరిధిలో రూ.3 కోట్ల 82 లక్షల 50 వేలతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం రూ.70 వేలను ఆ సంస్థ ఖర్చు చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టును ఫోర్డ్‌కు కాకుండా మడకశిర డబ్ల్యూసీసీ (వాటర్‌షెడ్ కంప్యూటర్ సెంటర్)కి బదలాయించారు. అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు రత్నగిరి వాటర్‌షెడ్‌లో జరిగిన దోపిడీ వ్యవహారంపై గత నెల 10న అవి‘నీటి’ ప్రవాహం... 11వ తేదీన గుంతల్లో గూడుపుఠాణీ...12వ తేదీన ‘పైపై పూత.. నిధుల మేత’.. 18వ తేదీన ‘సమయం లేదు తమ్ముడూ.. దొరికినంత దోచుడు!’ శీర్షికలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేపట్టడం, చెక్‌డ్యాంలను మరమ్మతు చేయకుండానే, కొన్నిచోట్ల అసలు నిర్మించకుండానే నిధులు భోంచేయడం తదితర అంశాలను ప్రస్తావించింది. ఈ కథనాలు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాయి. ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది పరారయ్యారు. దీనిపై ఫిబ్రవరి 13వ తేదీన ‘కనపడుట లేదు’ శీర్షికతో మరో కథనాన్ని ‘సాక్షి’ ఇచ్చింది. నిందితులకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన కీలక నేతల అండ ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా.. పనులన్నీ టీడీపీ నాయకులు చేపట్టిన క్రమంలో ‘సాక్షి’ కథనాలు కలకలం సృష్టించడంతో ‘తమ్ముళ్లు’ అప్రమత్తమయ్యారు. పలుచోట్ల రాత్రికి రాత్రే పనులు చేశారు. ఈ వ్యవహారంపై కూడా ఫిబ్రవరి 20వ తేదీన ‘చీకటి పనులు’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ఇచ్చింది. అవినీతిపై ఇంటెలిజెన్స్ ఆరా! వాటర్‌షెడ్ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు రొళ్ల మండలంలో ఆరా తీసినట్లు సమాచారం. ఏయే పనులు జరిగాయి, ఎవరు చేశారన్న దానిపై కొందరిని కలిసి మాట్లాడినట్లు తెలిసింది. వారం పాటు దీనిపై సమగ్ర పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం. ఇదే సమయంలో అధికారుల పాత్రపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. సామాజిక తనిఖీకి ముందు ఓ ఏపీడీ ‘ఫోర్డ్’ సిబ్బంది నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు, మరో రూ.2 లక్షలకు బేరం కుదరగా కొంత అడ్వాన్స్ తీసుకుని ఆ తర్వాత తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. -
చీకటి పనులు
రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలోని గుడ్డగుర్కి సమీపంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి పొలంలో ఐదు రోజుల క్రితం జేసీబీతో తీసిన ఫారంపాండ్ ఇది. వాస్తవానికి ఇక్కడ సేద్యపు కుంట తీయకుండానే బిల్లులు స్వాహా చేశారు. ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో హడావుడిగా ఫారంపాండ్ తవ్వారు. అనంతపురం టౌన్ / రొళ్ల : పరిగెత్తే నీటిని నడిపించడం.. నడిచే నీటిని నిలబెట్టడం.. ఇదీ వాటర్‌షెడ్ పథకం ఉద్దేశ్యం. అవసరం లేకపోయి నా చెక్‌డ్యాంలు నిర్మించడం..బాగున్నా మరమ్మతులు చేయడం.. పనులు చేయకుండా బిల్లులు చేసుకోవడం.. ఇదీ టీడీపీ నేతల తీరు. రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలో కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో దడ మొదలైంది. ప్రాజెక్టు పరిధిలోని రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీలో ఏడున్నరేళ్లలో రూ.11 కోట్ల విలువైన పనులు జరిగితే కేవలం 2016లో మాత్రమే రూ.5.88 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. ఫారంపాండ్లు, కొత్త చెక్‌డ్యాం లు, పాత చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో ‘ఫోర్డ్’ స్వచ్ఛంద సం స్థ ప్రతినిధులు దోచుకున్నారు. ఆయా పంచాయతీల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పొలాలు, గ్రామాల్లోని వంకల్లో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. సా మాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూసినా కేవలం రూ.79 లక్షలు మాత్రమే అవినీతి జరిగిందని తేల్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ జరిగిన అక్రమాలపై 10వ తేదీన అవి‘నీటి’ ప్రవాహం.. 11న గుంతగుంతలో గూడుపుఠానీ.. 12న పైపై పూత నిధుల మేత... 18వ తేదీన ‘సమయం లేదు ‘తమ్ముడూ’.. దొరికినంత దోచుడు’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు కలకలం సృష్టిం చాయి. వాటర్‌షెడ్ కమిటీ ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పనులు చేపట్టడం.. అసలు పనులే చేయకుం డా బిల్లులు చేసుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఫోర్డ్ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే క్షేత్రస్థాయిలో పనులు లేని విష యం తెలిసిపోతుందని టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. దీంతో వారం రోజులుగా ఫారంపాండ్స్, చెక్‌డ్యాం ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పోనీ వీటిని నాణ్యత గా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఉన్నాయంటే.. ఉన్నాయన్నట్టు కడుతున్నారు. పైగా ఇక్కడ జరిగిన పనులకు సం బంధించి ఎం–బుక్కులు, ఇతరత్రా రికార్డులు స్వాధీనం చేసుకోవడంలో డ్వామా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్ట్ కార్యాలయంలో వాటర్‌షెడ్ అసిస్టెంట్లు రికార్డులన్నీ సరి చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడ పనులు చేసినట్లు బిల్లులు తీసుకున్నారో చూసి వాటి వివరాలను తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. దీంతో వారు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రత్నగిరి పంచాయతీలోని అలుపనపల్లికి చెందిన టీడీపీ నాయకులు మూడ్రోజులుగా ఆరు చెక్‌డ్యాం నిర్మాణాలను రాత్రి వేళ చేపడుతున్నారు. కాకి పంచాయతీలోని ఓ నాయకుడు సైతం రెండు చెక్‌డ్యాంలు, మూడు ఫారంపాండ్లను తవ్విస్తున్నారు. -
రత్నగిరి వాటర్‌షెడ్ అవినీతిపై కలెక్టర్ సీరియస్
– నిధుల రికవరీకి ఆదేశం – డ్వామా పీడీ నాగభూషణం వెల్లడి మడకశిర : రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌లో జరిగిన అవినీతిపై కలెక్టర్ కోన శశిధర్ సీరియస్‌గా ఉన్నట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ నాగభూషణం తెలిపారు. ఆయన శుక్రవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక ఏపీడీ విశ్వనాథ్‌తో సమావేశమై రత్నగిరి మెగా వాటర్‌షెడ్ అవినీతిపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మెగా వాటర్‌షెడ్‌లో రూ.79 లక్షల అవినీతి జరిగినట్లు తెలిపారు. బాధ్యులైన వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. దుర్వినియోగమైన నిధులను పూర్తి స్థాయిలో రికవరీ చేస్తామని తెలిపారు. పని చేయకుండానే నిధులను స్వాహా చేశారన్నారు. కూలీలతో కాకుండా యంత్రాలతో పనులు చేపట్టారని చెప్పారు. పోస్టల్ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. ఈ వాటర్‌షెడ్ అవినీతిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంతటివారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. పని కల్పించిన సిబ్బందికే వేతనాలు జిల్లావ్యాప్తంగా కూలీలకు పనులు కల్పించిన ఉపాధి హామీ సిబ్బందికి మాత్రమే వేతనాలు చెల్లిస్తామని డ్వామా పీడీ తెలిపారు. జిల్లాలోని 12 పంచాయతీల్లో పనులు కల్పించని 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించామన్నారు. అలాగే తక్కువగా పనులు చూపిన 171 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. ఖాళీగా ఉన్న 121 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 పనిదినాలు పూర్తి చేసిన వారిని జన్మభూమి కమిటీ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసి పంపితే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఏడో తరగతి పాసైతే చాలన్నారు. జిల్లాకు కోటి పనిదినాలను అదనంగా ఇచ్చారని, ఇందులో మార్చిలోగా 50 లక్షల పనిదినాలను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. -
అవి‘నీటి’ ప్రవాహం
– రత్నగిరి వాటర్‌షెడ్‌లో భారీ అక్రమాలు – రూ.1.80 కోట్ల దుర్వినియోగం – సామాజిక తనిఖీలో వెల్లడైన అక్రమాలు – ఐదుగురిపై క్రిమినల్ కేసు – రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ‘కీలక’ నేత – మద్దతుగా నిలుస్తున్న ఓ ఎమ్మెల్సీ అనంతపురం టౌన్ : లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు.. ఇదీ ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ తీరు. రొళ్ల మండలంలోని రత్నగిరి మెగా వాటర్‌షెడ్ నిర్వహణను చూసిన ఈ సంస్థ భారీఎత్తున అక్రమాలకు పాల్పడింది. జల సంరక్షణ పనులను గాలికొదిలేసి..సొంత ‘సంరక్షణ’ను చూసుకుంది. కూలీలతో చేయించాల్సిన ఫారంపాండ్లను యంత్రాలతో కానిచ్చేసింది. చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు స్వాహా చేసింది. పండ్లతోటల పెంపకం చేపట్టకుండానే నిధులు దిగమింగింది. ఈ అక్రమాలన్నీ సామాజిక తనిఖీలో బహిర్గతం కావడంతో చర్యల నుంచి తప్పించుకునేందుకు ‘ఫోర్డ్’ నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదటి బ్యాచ్‌లోనే ప్రారంభం : 2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్ కింద రొళ్ల మండలంలో రత్నగిరి మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దీన్ని ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు కాల వ్యవధి ఏడేళ్లు. గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. ఈ ప్రాజెక్టు కింద రత్నగిరి, కాకి, దొడ్డెరి, గుడ్డిగుర్కి పంచాయతీల్లో మైక్రో వాటర్షెడ్లు ఉన్నాయి. సమగ్ర వాటర్‌షెడ్ అభివృద్ధి పథకం (ఐడబ్లూ్యఎంపీ) కింద మొత్తం 4,104 హెక్టార్లలో రూ.4.92 కోట్లతో రత్నగిరి మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టును రూపొందించారు. కాల వ్యవధి ముగిసే నాటికి రూ.4.87 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడికక్కడ దోపిడీ.. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి అక్రమాల పరంపర కొనసాగించారు. సిబ్బందినంతా స్వచ్ఛంద సంస్థే నియమించుకునే వెసులుబాటు ఉండటంతో అక్రమాలకు తెరలేపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు చేయకుండానే చేసినట్లు చూపి నిధుల స్వాహాపర్వానికి తెరలేపారు. ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమాల పరంపర సాగించారు. 2014–16 మధ్య కాలంలో ప్రాజెక్టు పరిధిలో 1,720 పనులు చేపట్టి రూ.9.60 కోట్లు (ఉపాధి నిధులు కలిపి) ఖర్చు చేశారు. ఈ పనులపై ఇటీవల సామాజిక తనిఖీ జరిగింది. నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. పనులు చేయకుండానే బిల్లులు చేయడం, బినామీ పేర్లతో నిధుల డ్రా, కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేపట్టడం వంటి అక్రమాలు బహిర్గతమయ్యాయి. గుడ్డగుర్కి పంచాయతీలో రూ.60 లక్షలు, రత్నగిరి రూ.60 లక్షలు, దొడ్డేరి రూ.30 లక్షలు, కాకి పంచాయతీలో రూ.30 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. రెండేళ్ల వ్యవధిలో జరిగిన పనులకు సంబంధించిన తనిఖీల్లో ఈ అవినీతి ‘లెక్క’తేలింది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చేపట్టిన పనులపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో క్రిమినల్ కేసులు సామాజిక తనిఖీలో వెలుగుచూసిన అక్రమాలను జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తక్షణమే స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ బదరీష్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్ ఇంజనీర్లు, సిబ్బంది మహాలింగప్ప, బాలాజీ, నరసింహమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ మడకశిర ఏపీడీ విశ్వనాథ్ రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.79 లక్షలు దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు. రంగంలోకి కాంగ్రెస్ ‘కీలక’ నేత అక్రమార్కులను రక్షించేందుకు రాజకీయ నాయకులు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీలో ఉన్న ఓ ఎమ్మెల్సీ సైతం రంగంలోకి దిగారు. ఈ సంస్థ ఓ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించినది కావడంతో వారంతా ఉన్నత స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. కావాలంటే మళ్లీ పనులు చేస్తామని, కేసుల విషయంలో వెనుక్కుతగ్గాలని కోరినట్లు సమాచారం. అయితే.. ఈ అక్రమాలను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్ ‘చర్యలు తప్పవని’ వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపి ఎంతో కొంత తీవ్రత తగ్గించుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినికిడి.