‘రత్నగిరి’ అక్రమాలపై కొరడా | actions on rathnagiri watershed illegal activities | Sakshi
Sakshi News home page

‘రత్నగిరి’ అక్రమాలపై కొరడా

Published Wed, Mar 15 2017 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

‘రత్నగిరి’ అక్రమాలపై కొరడా - Sakshi

‘రత్నగిరి’ అక్రమాలపై కొరడా

- బ్లాక్‌ లిస్ట్‌లో ‘ఫోర్డ్‌’!
– స్వచ్ఛంద సంస్థ అక్రమాలకు చెక్‌
– రావుడి వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు రద్దు
– ‘రత్నగిరి’లో రూ.79 లక్షల రికవరీకి నిర్ణయం
– కలెక్టర్‌ కోన శశిధర్‌ వద్దకు ఫైల్‌
– ‘అవినీతి’పై వరుస కథనాలిచ్చిన ‘సాక్షి’


అనంతపురం టౌన్‌ : వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న వాటర్‌షెడ్‌ పథకంలో అక్రమాలకు పాల్పడిన ‘ఫోర్డ్‌’ స్వచ్ఛంద సంస్థపై  వేటు పడింది. భారీఎత్తున దోపిడీకి పాల్పడినట్లు రుజువు కావడంతో ఈ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది.  2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్‌ కింద రొళ్ల మండలంలో రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని పరిధిలో రత్నగిరి, కాకి, దొడ్డెరి, గుడ్డిగుర్కి పంచాయతీలు (మైక్రో వాటర్‌షెడ్లు) ఉన్నాయి. వీటిలోని 4,104 హెక్టార్ల విస్తీర్ణంలో జలసంరక్షణ పనులు చేపట్టేందుకు రూ.4కోట్ల 92 లక్షల 98 వేలతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఏడేళ్ల వ్యవధిలో ఈ నాలుగు మైక్రో వాటర్‌షెడ్ల పరిధిలో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే.. ‘ఫోర్డ్‌’ సంస్థ భారీఎత్తున అక్రమాలకు పాల్పడింది.

అక్రమాలపై కలెక్టర్‌ కన్నెర్ర
రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ పరిధిలో జరిగిన అక్రమాలపై కలెక్టర్‌ కోన శశిధర్‌ కన్నెర్ర చేశారు. ప్రాజెక్ట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ బదరీశ్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్‌ ఇంజినీర్లు, సిబ్బంది బాలాజీ, మహాలింగప్ప, నరసింహమూర్తిపై ఇప్పటికే క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. రూ.79 లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ఫోర్డ్‌’ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపారు. అక్కడి నుంచి రాగానే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు పంపనున్నారు.

రావుడి వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు రద్దు
 2014–15 బ్యాచ్‌ కింద ‘ఫోర్డ్‌’ సంస్థకు అగళి మండలంలో ‘రావుడి’ వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు మంజూరైంది. 2,550 హెక్టార్ల పరిధిలో రూ.3 కోట్ల 82 లక్షల 50 వేలతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే  డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) కోసం రూ.70 వేలను ఆ సంస్థ ఖర్చు చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టును ఫోర్డ్‌కు కాకుండా మడకశిర డబ్ల్యూసీసీ (వాటర్‌షెడ్‌ కంప్యూటర్‌ సెంటర్‌)కి బదలాయించారు.

అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు
రత్నగిరి వాటర్‌షెడ్‌లో జరిగిన దోపిడీ వ్యవహారంపై గత నెల 10న అవి‘నీటి’ ప్రవాహం... 11వ తేదీన గుంతల్లో గూడుపుఠాణీ...12వ తేదీన ‘పైపై పూత.. నిధుల మేత’.. 18వ తేదీన ‘సమయం లేదు తమ్ముడూ.. దొరికినంత దోచుడు!’ శీర్షికలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేపట్టడం, చెక్‌డ్యాంలను మరమ్మతు చేయకుండానే, కొన్నిచోట్ల అసలు నిర్మించకుండానే నిధులు భోంచేయడం తదితర అంశాలను ప్రస్తావించింది. ఈ కథనాలు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాయి. ప్రాజెక్ట్‌ అధికారులు, సిబ్బంది పరారయ్యారు. దీనిపై ఫిబ్రవరి 13వ తేదీన ‘కనపడుట లేదు’ శీర్షికతో మరో కథనాన్ని ‘సాక్షి’ ఇచ్చింది. నిందితులకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన కీలక నేతల అండ ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా.. పనులన్నీ టీడీపీ నాయకులు చేపట్టిన క్రమంలో ‘సాక్షి’ కథనాలు కలకలం సృష్టించడంతో ‘తమ్ముళ్లు’ అప్రమత్తమయ్యారు. పలుచోట్ల రాత్రికి రాత్రే పనులు చేశారు. ఈ వ్యవహారంపై కూడా ఫిబ్రవరి 20వ తేదీన ‘చీకటి పనులు’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ఇచ్చింది.

అవినీతిపై ఇంటెలిజెన్స్‌ ఆరా!
వాటర్‌షెడ్‌ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు రొళ్ల మండలంలో ఆరా తీసినట్లు సమాచారం. ఏయే పనులు జరిగాయి, ఎవరు చేశారన్న దానిపై కొందరిని కలిసి మాట్లాడినట్లు తెలిసింది. వారం పాటు దీనిపై సమగ్ర పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం. ఇదే సమయంలో అధికారుల పాత్రపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. సామాజిక తనిఖీకి ముందు ఓ ఏపీడీ ‘ఫోర్డ్‌’ సిబ్బంది నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు, మరో రూ.2 లక్షలకు బేరం కుదరగా కొంత అడ్వాన్స్‌ తీసుకుని ఆ తర్వాత తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement