అవి‘నీటి’ ప్రవాహం | corruption in rathnagiri watershed | Sakshi
Sakshi News home page

అవి‘నీటి’ ప్రవాహం

Published Thu, Feb 9 2017 10:43 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవి‘నీటి’ ప్రవాహం - Sakshi

అవి‘నీటి’ ప్రవాహం

– రత్నగిరి వాటర్‌షెడ్‌లో భారీ అక్రమాలు
– రూ.1.80 కోట్ల దుర్వినియోగం
– సామాజిక తనిఖీలో వెల్లడైన అక్రమాలు
– ఐదుగురిపై క్రిమినల్‌ కేసు
– రంగంలోకి కాంగ్రెస్‌ పార్టీ ‘కీలక’ నేత
– మద్దతుగా నిలుస్తున్న ఓ ఎమ్మెల్సీ


అనంతపురం టౌన్‌ : లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు.. ఇదీ ఫోర్డ్‌ స్వచ్ఛంద సంస్థ తీరు. రొళ్ల మండలంలోని రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ నిర్వహణను చూసిన ఈ సంస్థ భారీఎత్తున అక్రమాలకు పాల్పడింది. జల సంరక్షణ పనులను గాలికొదిలేసి..సొంత ‘సంరక్షణ’ను చూసుకుంది. కూలీలతో చేయించాల్సిన ఫారంపాండ్లను యంత్రాలతో కానిచ్చేసింది. చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు స్వాహా చేసింది. పండ్లతోటల పెంపకం చేపట్టకుండానే నిధులు దిగమింగింది. ఈ అక్రమాలన్నీ సామాజిక తనిఖీలో బహిర్గతం కావడంతో చర్యల నుంచి తప్పించుకునేందుకు ‘ఫోర్డ్‌’ నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మొదటి బ్యాచ్‌లోనే ప్రారంభం :
2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్‌ కింద రొళ్ల మండలంలో రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. దీన్ని ఫోర్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు కాల వ్యవధి ఏడేళ్లు. గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. ఈ ప్రాజెక్టు కింద రత్నగిరి, కాకి, దొడ్డెరి, గుడ్డిగుర్కి పంచాయతీల్లో మైక్రో వాటర్‌షెడ్‌లు ఉన్నాయి. సమగ్ర వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకం (ఐడబ్లూ‍్యఎంపీ) కింద మొత్తం 4,104 హెక్టార్లలో రూ.4.92 కోట్లతో రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టును రూపొందించారు. కాల వ్యవధి ముగిసే నాటికి రూ.4.87 కోట్లు ఖర్చు చేశారు.

ఎక్కడికక్కడ దోపిడీ..
ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచి అక్రమాల పరంపర కొనసాగించారు. సిబ్బందినంతా స్వచ్ఛంద సంస్థే నియమించుకునే వెసులుబాటు ఉండటంతో అక్రమాలకు తెరలేపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు చేయకుండానే చేసినట్లు చూపి నిధుల స్వాహాపర్వానికి తెరలేపారు. ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమాల పరంపర సాగించారు.

2014–16 మధ్య కాలంలో ప్రాజెక్టు పరిధిలో 1,720 పనులు చేపట్టి రూ.9.60 కోట్లు (ఉపాధి నిధులు కలిపి) ఖర్చు చేశారు. ఈ పనులపై ఇటీవల సామాజిక తనిఖీ జరిగింది. నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. పనులు చేయకుండానే బిల్లులు చేయడం, బినామీ పేర్లతో నిధుల డ్రా, కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేపట్టడం వంటి అక్రమాలు బహిర్గతమయ్యాయి. గుడ్డగుర్కి పంచాయతీలో రూ.60 లక్షలు, రత్నగిరి రూ.60 లక్షలు, దొడ్డేరి  రూ.30 లక్షలు, కాకి పంచాయతీలో రూ.30 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. రెండేళ్ల వ్యవధిలో జరిగిన పనులకు సంబంధించిన తనిఖీల్లో ఈ అవినీతి ‘లెక్క’తేలింది. ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచి చేపట్టిన పనులపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది.

కలెక్టర్‌ ఆదేశాలతో క్రిమినల్‌ కేసులు
సామాజిక తనిఖీలో వెలుగుచూసిన అక్రమాలను జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు కలెక్టర్‌ కోన శశిధర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తక్షణమే స్పందించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ బదరీష్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్‌ ఇంజనీర్లు, సిబ్బంది మహాలింగప్ప, బాలాజీ, నరసింహమూర్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలంటూ మడకశిర ఏపీడీ విశ్వనాథ్‌ రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.79 లక్షలు దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు.

రంగంలోకి కాంగ్రెస్‌  ‘కీలక’ నేత
అక్రమార్కులను రక్షించేందుకు రాజకీయ నాయకులు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీలో ఉన్న ఓ ఎమ్మెల్సీ సైతం రంగంలోకి దిగారు. ఈ సంస్థ ఓ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించినది కావడంతో వారంతా ఉన్నత స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. కావాలంటే మళ్లీ పనులు చేస్తామని, కేసుల విషయంలో వెనుక్కుతగ్గాలని కోరినట్లు సమాచారం. అయితే.. ఈ అక్రమాలను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్‌ ‘చర్యలు తప్పవని’ వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపి ఎంతో కొంత తీవ్రత తగ్గించుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement