అవినీతి జలగలూ...పీడించొద్దు
కలెక్టర్ కే.భాస్కర్
ఏలూరు సిటీ: జిల్లాలో నూతనంగా పరిశ్రమలు స్థాపించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తోన్న పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టవద్దని, అవినీతి జలగలు పారిశ్రామిక వేత్తలను పీడించొద్దని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రొత్సాహక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15 రోజుల్లో సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు మంజూరుచేస్తామని పరిశ్రమల శాఖ గొప్ప చెప్పడమే తప్ప దరఖాస్తు చేసిన ఏడాదికి కూడా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకపోతే పరిశ్రమలు స్ధాపించడానికి ఎవరు ముందుకు వస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. పారిశ్రామికవేత్త దరఖాస్తులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అక్కడికక్కడే సరిదిద్ది ఏ విధంగా పరిశ్రమకు అనుమతివ్వాలో పారిశ్రామికవేత్తలకు మంచి సలహాలు సూచనలు అందించి పారదర్శకంగా 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తేనే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి సాధించగలదన్నారు. పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టరు చెప్పారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు,పరిశ్రమల శాఖడిప్యూటీ జీఎం ఆదిశేషు, డీపీఓ కె.సుధాకర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కోటయ్య పాల్గొన్నారు.