కలెక్టర్ల సమావేశంలో పిచ్చాపాటా?
సీఎం తీరుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి వ్యయంతో నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సమావేశాలను సీఎం చంద్రబాబు పిచ్చాపాటి కబుర్లతో సోదిలా మార్చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పాలనాపరమైన అంశాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించాల్సిన సమావేశాన్ని కాలక్షేపం కోసం నిర్వహించినట్లుగా ఉందని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో కింది స్థాయి నుంచి ప్రజలకు ఉపయోగపడే ఫైళ్లపై తాను సంతకాలు చేయలేకపోయానని, పైరవీలు, లాబీయింగ్ ద్వారా వచ్చిన ఫైళ్లపై మాత్రమే సంతకాలు చేశానని చంద్రబాబే చెప్పుకోవడం చూస్తే ఆయన పాలన ఎలా సాగిందో అర్థం అవుతోందన్నారు.
బాక్సైట్ తవ్వకాల జీవో, కాపుల పథకాలకు చంద్రన్న పేరు పెట్టాల్సిందిగా ఇచ్చిన జీవోలు తనకు తెలియకుండానే జారీ అయ్యాయని చెప్పడం, సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఫైళ్లపై సంతకాలు చేయలేదనడం చూస్తుంటే ఆయన పాలన ఎలా ఉందో ఆయనే నుదుటిపై రాసుకున్నట్లు ఉందన్నారు. సాగునీటి శాఖ ఫైళ్ల (ప్రాజెక్టుల అంచనాల పెంపునకు సంబంధించినవి)పై సంతకాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై చంద్రబాబే స్వయంగా ఒత్తిడి చేస్తుంటే జిల్లా కలెక్టర్లు కింద నుంచి ప్రజలకు ఉపయోగపడే ఫైళ్లు ఎలా పంపుతారన్నారు. ప్రధాన కార్యదర్శులు సంతకాలు నిరాకరించిన ఫైళ్లపై చంద్రబాబే కేబినెట్‌లో పెట్టి ఆమోదింప జేసుకున్నారన్నారు. లోకేశ్, మంత్రులు, టీడీపీ నేతల ఒత్తిడితో కదిలే ఫైళ్లపైనే సంతకాలు అవుతున్నాయని విమర్శించారు.
దైవభక్తినీ అపహాస్యం చేస్తారా?
ప్రజలు పాపాలు ఎక్కువగా చేస్తున్నారు కనుకనే గుడులు, మసీదులు, చర్చిలకు పోతున్నారని..అక్కడ హుండీల్లో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని, అయ్యప్ప దీక్షల సీజన్‌లో మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని సీఎం స్థాయి వ్యక్తి కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించడం శోచనీయమని వాసిరెడ్డి పద్మ అ న్నారు. దైవభక్తి, పాపభీతి, దేవుడంటే భ యం కూడా లేని చంద్రబాబు.. ప్రజలకు న్న విశ్వాసాలను తప్పు పట్టడం మంచిది కాదన్నారు. మద్యం బెల్ట్‌షాపుల రద్దు అమలు ఎంతవరకు వచ్చిందో ఒక్కసారైనా చంద్రబాబు సమీక్షించారా అని ఆమె ప్రశ్నించారు.