ఆందోళనకారులతో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ లఠ్కర్
గుంటూరు రూరల్: మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వివాదంలో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేయటంతో గ్రామస్తులు ఆందోళన నిర్వహించిన ఘటన మండలంలోని బుడంపాడు గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీరు కలుషితమై ఇబ్బందులు పడుతున్నామని అధికారులను అడిగితే దురుసుగా మాట్లాడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టులు చేయిస్తారా అంటూ గ్రామస్తులు ప్రధాన రహదారిలో వాహనాలను నిలిపి ఆందోళనకు దిగారు. నెలరోజులుగా మురికినీరు తాగి రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది సరఫరాచేసే ట్యాప్ నీటిని వాటర్ బాటిల్స్‌లో పట్టి నిరసన తెలిపారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవటంతో సౌత్‌జోన్ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, డీఎస్పీ సీతారామయ్య ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట..
అనంతరం ఆందోళన కారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ సీసీ, ఏఈలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే కార్యాలయంపై దాడిచేసి ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించినందుకు, కార్యాలయంలోని ఫర్నీచర్, బయోమెట్రిక్ మెషిన్‌లను ధ్వంసం చేసిన కేసులో పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మంచి నీటిని సక్రమంగా సరఫరా చేయమని అడిగితే అరెస్టులు ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటలకుపైగా ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ లఠ్కర్ ప్రజలతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయటం సమంజసంకాదన్నారు. అనంతరం స్థానికులు ప్రస్తుతం మురుగు నీరు వస్తున్నందున గ్రామానికి 40 లారీల నీటిని అధికారులు అందజేయాలని కోరగా, అధికారులు ప్రస్తుతం 15 లారీలు వస్తున్నాయని వాటిని పెంచి సరిపడేంతగా పంపుతామని చెప్పారు. అయితే కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సౌత్‌జోన్ డీఎస్పీ మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment