
‘గన్నవరం’ విస్తరణకూ భూసమీకరణ
పురపాలక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) ద్వారానే భూమిని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను 180రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భూసమీకరణపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 15రోజుల్లోగా తెలపాలని సూచించింది. పురపాలక శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత విస్తీర్ణం భూమిని సేకరిస్తామన్న అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన విషయం విదితమే. రాజధాని తరహాలోనే ప్యాకేజీ రాజధాని భూసమీకరణ ప్యాకేజీ తరహాలోనే గన్నవరం ఎయిర్‌పోర్టు భూసమీకరణ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. భూసమీకరణలో పట్టా, దేవాదాయ, వక్ఫ్ భూమి ఒక ఎకరం అప్పగిస్తే.. వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం, 450గజాల వాణిజ్య స్థలం సంబంధిత భూమి యజమానికి అప్పగిస్తారు. అసైన్డు భూముల లబ్ధిదారులు ఎకరం అప్పగిస్తే 800చదరపు గజాల ఇంటి స్థలం, 200గజాల వాణిజ్య స్థలం అప్పగిస్తారు.
భూములు అప్పగించిన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తారు. ఈ కౌలును పదేళ్లపాటూ.. ఏటా రూ.5 వేలు పెంచుతూ చెల్లిస్తారు. భూసమీకరణ చేసే గ్రామాల్లో కౌలు రైతులు, రైతు కూలీల కుటుంబాలకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ అందిస్తారు. భూసమీకరణ చేసే ప్రాంతంలో రైతుల రుణాలను గరిష్టంగా రూ.1.50 లక్షలను ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిరుపేదలకు స్వయం ఉపాధి కోసం రూ.25 లక్షల వరకూ రుణాన్ని వడ్డీ లేకుండా ఇప్పిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ల్యాండ్‌పూలింగ్ చేసే గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, వారి పిల్లల నైపుణ్యాలకు మెరుగులు దిద్ది ఉపాధి కల్పిస్తారు. ఆ గ్రామాల్లో 365రోజులపాటూ ఉపాధి హామీ పథకం కింద పనికల్పిస్తామని ప్రభుత్వం స్పష్టీకరించింది.