జీహెచ్‌ఎంసీలో కార్మికుల వేతనం రూ.1,800 పెంపు
ఇతర కార్పొరేషన్లు/మున్సిపాలిటీల్లో రూ.1,600, నగర పంచాయతీల్లో రూ.600 పెంపు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమవడంతో పురపాలక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. బుధవారం పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి సమక్షంలో సచివాలయంలో చర్చలు జరిగాయి. అనంతరం సమ్మెను విరమిస్తున్నామని, గురువారం నుంచి ఉద్యోగులు విధులకు హాజరవుతారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల వేతనం రూ.1,800 పెరిగింది. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 1,600 రూపాయలు, నగర పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి 600 రూపాయలు మాత్రమే పెంచడానికి మంత్రి అంగీకరించారు.
ప్రస్తుతం పెంచిన వేతనంతో కలిపి జీహెచ్‌ఎంసీలోని కార్మికులకు 8,500 రూపాయలు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో పనిచేసే వారికి రూ.7,300 వేతనం వస్తుంది. పర్మినెంట్ కార్మికులు మరణిస్తే దహన సంస్కారాల కోసం ఇస్తున్న రూ.10 వేల సాయాన్ని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపజేయడానికి మంత్రి అంగీకరించారు. పర్మినెంట్ కార్మికులకు పీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మారుస్తామని, వారికి ఆరోగ్యకార్డులు పంపిణీ చేస్తామని మంత్రి మహీధర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన వేతన సవరణ సంఘం ఇచ్చే నివేదికలో సిఫారసు చేసే కనీస వేతనాన్ని కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రిని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వేతనాల పెంపుపై కార్మిక సంఘాల ప్రతినిధులు పాలడుగు భాస్కర్, కిర్ల కృష్ణారావు, శంకర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యకార్డులు, జీపీఎఫ్‌నకు అంగీకరించడంపై మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ఎల్.వర్మ హర్షం వ్యక్తంచేశారు.
ముగిసిన మున్సిపల్ కార్మికుల సమ్మె
Published Thu, Feb 13 2014 4:38 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement
Advertisement