‘ఎజెండా’పై గందరగోళం | confusion | Sakshi
Sakshi News home page

‘ఎజెండా’పై గందరగోళం

Published Mon, Sep 19 2016 10:34 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

‘ఎజెండా’పై గందరగోళం - Sakshi

‘ఎజెండా’పై గందరగోళం

  • వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు
  • 327 అంశాలపై చర్చించిన కౌన్సిల్‌
  • పలు పనులకు అనుమతి మంజూరు
  • కామారెడ్డి రూరల్‌:
    కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం మళ్లీ రసాభాసగా మారింది. ఎజెండా అంశాలపై అధికార, విపక్షాల మధ్య గందరగోళం చెలరేగింది. సమావేశం ఏకపక్షంగా సాగుతోందంటూ కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తొలిసారి హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కౌన్సిల్‌ సమావేశంలో 327 అంశాలపై చర్చించారు.
    కాంగ్రెస్‌ వాకౌట్‌..
    సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలను ఇప్పుడు సభ ముందు ఎలా ఉంచుతారని నిలదీశారు. గత ఎజెండా అంశాలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయని, హైకోర్టుకు సమాధానం పంపాల్సిన అధికారులు.. అదేమీ పట్టించుకోకుండా పాత ఎజెండాను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌన్సిల్‌ సమావేశం టీఆర్‌ఎస్‌ సమావేశంలా మారిందంటూ నిరసన తెలుపుతూ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, జమీల్, రామ్మోహన్, బట్టు మోహన్, లక్ష్మణ్‌రావు, శశిరేఖ, పద్మ, సునీత వాకౌట్‌ చేశారు.
    పనుల నిర్వహణకు అనుమతులు..
    అనంతరం సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే ప్రగతి పనులకు కౌన్సిల్‌ సమావేశం అనుమతించింది. సీసీ రోడ్లు, మెటల్‌ రోడ్లు, పైప్‌లైన్‌ నిర్మాణాలు, సీసీ డ్రైనేజీలు, మురుగుకాలువ నిర్మాణాలు,అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది టెండర్, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. నీటి సమస్య నివారణకు టాస్క్‌పోర్సు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటర్‌వర్క్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలను ప్రక్షాళన చేయాలని కౌన్సిలర్‌ భూంరెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను కోరారు. స్పందించిన ఆయన మిగులు సిబ్బందిని అవసరమున్న చోటుకు పంపించాలని కమిషనర్‌ విజయలక్ష్మికి సూచించారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పైరవీలు చేస్తున్నారని కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్, రవియాదవ్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ సూచించగా.. ఈ మేరకు సర్క్యూలర్‌ జారీ చేస్తానని కమిషనర్‌ తెలిపారు. స్టేషన్‌ రోడ్డులోని మడిగెలకు, మటన్‌ మార్కెట్‌ మడిగెలకు అద్దె నిర్ణయించాలని, తద్వారా మున్సిపల్‌ ఆదాయం పెరుగుతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వైస్‌ చైర్మన్‌ మసూద్‌అలీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
    చేపల మార్కెట్‌గా బల్దియా: ప్రభుత్వ విప్‌
    మున్సిపల్‌ కార్యాలయం చేపల మార్కెట్‌గా మారిందని విప్‌ గంగ గోవర్ధన్‌ వ్యాఖ్యానించారు. దీన్ని మార్చాలని ఆయన అధికారులకు సూచించారు. కామారెడ్డి నూతన జిల్లా కానున్న తరుణంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో పట్టణాభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై జోక్యం చేసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు.
    మున్సిపల్‌ ఎజెండాపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం
    కామారెడ్డి: మున్సిపల్‌ సర్వసభ్య సమావేశ ఎజెండాలో చేర్చిన 1, 2, 3, 4 అంశాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుష్మకు డీసెంట్‌ నోట్‌ అందజేశారు. ఈ బాక్స్‌ టెండర్లకు సంబంధించి ఎటువంటి నోటీసులను ప్రదర్శించ లేదని, నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్‌లకు మేలు చేయడానికి రహస్య టెండర్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ టెండర్‌లను రద్దు చేసి మళ్లీ టెండర్లను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎజెండా అంశంలోని 179వ అంశంపై బీజేపీ కౌన్సిలర్‌ భారతమ్మ డీసెంట్‌ నోట్‌ అందించారు. మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ను మసీదులు, మందిరాల వద్ద వాడవచ్చా లేదా అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement