ఆంగ్ల మాధ్యమంపై ఊగిసలాట
ఆంగ్ల మాధ్యమంపై ఊగిసలాట
Published Wed, May 17 2017 12:10 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
భీమవరం టౌన్ : మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన ఊగిసలాటలో పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో మంత్రులు, అధి కారుల వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ఉంటుం దని పేర్కొనగా.. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ పాఠశాలల్లో జూన్ 11 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏ మాధ్యమంలో విద్యాబోధన చేస్తారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత మాత్రం రాలేదు. తొలుత తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలొచ్చాయి. అందుకు అనుగుణంగానే జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. అనంతరం కేవలం ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఇండెంట్ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక జిల్లా అధికారులు ఇండెంట్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు.
మెప్మా సహకారంతో..
ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన దిశగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్నద్ధం చేసేం దుకు ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతో మున్సిపాలిటీల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలు చేస్తున్నామని, పిల్ల లందరినీ ఆ పాఠశాలల్లో చేర్పించాలంటూ ఇంటింటా ప్రచారం చేయించారు. ఆంగ్ల మాధ్యమంపై మక్కువతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నది ప్రభుత్వ భావన. ఈ నేపథ్యంలోనే ఆంగ్లంలో బోధనతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 6 నుంచి 10వ తరగతి వరకు కెరీర్ ఫౌండేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే, ఆంగ్లమాధ్యమ బోధనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. మరోవైపు ఆంగ్లమాధ్యమ బోధనకు ఉపాధ్యాయులు సైతం సన్నద్ధంగా లేదు. ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. ఆంగ్లంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు.
పట్టణాల వారీగా పాఠశాలల సంఖ్య ఇలా..
పట్టణం ప్రాథవిుక ప్రాథవిు ఉన్నత కోన్నత పాఠశాలలు
భీమవరం 35 01 06
ఏలూరు 38 04 07
నరసాపురం 20 05 06
నిడదవోలు 11 01 03
పాలకొల్లు 22 00 06
తాడేపల్లిగూడెం 19 01 06
తణుకు 14 02 01
మొత్తం 159 14 35
మాతృభాషలో బోధనే మంచిది
ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలో బోధన అవసరం. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుంది. తొలుత మాతృభాష, తరువాత హిందీ, ఆ తరువాత అంతర్జాతీయ భాషలో బోధన అవసరమని కొఠారి కమిషన్ సూచించింది. – ఎంఐ విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
రెండు మాధ్యమాలూ ఉండాలి
మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం బోధన ఒక్కటే పెడతామనడం సరికాదు. తెలుగులోనూ బోధన ఉండి తీరాలి. రెండూ ఉంటేనే విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో చేరతారు.
– టి.సత్యనారాయణమూర్తి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ కార్యదర్శి
పిల్లలు బడికి దూరమవుతారు
బలవంతంగా ఆంగ్లమాధ్యమాన్ని రుద్దితే అర్థంకాక పిల్లలు స్కూలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంది. మాతృభాషతోపాటు ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అవసరమే. పూర్తిగా ఆంగ్లమాధ్యమ బోధన సరికాదు.
– షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మాతృభాష బోధన అవసరం
విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషలోనే బోధన ఉండాలి. 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తే బాగుంటుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉండి తీరాలి.
– కోడి వెంకట్రావు, ప్రధానోపా«ధ్యాయుడు, భీమవరం
Advertisement