పచ్చి బూతులు.. ముష్టిఘాతాలు
► తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
► మహిళా కౌన్సిలర్ల సాక్షిగా బండబూతులు
► టీడీపీ నేతల మధ్యవర్తిత్వంతో సర్దుబాటు
► ఎమ్మెల్యే సమక్షానికి ‘పంచాయితీ’...!
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో గతంలో ఎన్నడూ జరగని దుశ్చర్య చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన చోట అధికార టీడీపీ కౌన్సిలర్లు వ్యక్తిగత ప్రతిష్టకు పోయారు. బండబూతులు తిట్టుకున్నారు. మహిళా కౌన్సిలర్లు ఉన్నారనే ఖాతరు లేకుండా సభ్యసమాజం వినలేని తిట్లు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పరస్పరం దాడిచేసుకున్నారు. తోటికౌన్సిలర్లు భయాందోళనకు లోనయ్యారు. వార్తా చానళ్లలో ఈ ఘోరాన్ని వీక్షించిన ప్రజలు నివ్వెరపోయారు. ఇదేం పోయేకాలం...? అంటూ విస్మయం వ్యక్తంచేశారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఈ విధంగా రచ్చకెక్కాయనే అభిప్రాయం వినవస్తోంది. - తెనాలి అర్బన్
తెనాలిఅర్బన్ తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం చైర్‌పర్సన్ కొత్తమాసు తులసీదాస్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మూడు ప్యానల్ కమిటీలకు సభ్యులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జరగాల్సిన కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వెంటనే కొనసాగిద్దామన్న చైర్‌పర్సన్ ప్రతిపాదనను కౌన్సిలర్లు ఆమోదించారు.
వివాదం మొదలైంది ఇలా....
అజెండాలోని మొదటి అంశాన్ని చదివేందుకు మున్సిపల్ ఉద్యోగి ఉద్యుక్తులు కాగా, టీడీపీకి చెందిన 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ లేచి మాట్లాడుతూ, ప్రత్యేక సమావేశంలో ఆమోదించిన ప్యానల్ కమిటీ పేర్లను వెంటనే మిన్‌ట్స్ పుస్తకంలో రాయాలని కోరారు.ఇందుకు 19, 35వ వార్డుల టీడీపీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, పెండేల సుబ్బారావులు వ్యతిరేకించారు. కౌన్సిల్ ఏర్పడి సుమారు రెండేళ్లుగా అలాంటి ఆనవాయితీ లేదనీ, కొత్తగా ఎందుకు కోరుతున్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు. సమావేశంలో చదివి, ఆమోదం పొందిన పేర్లను మినిట్స్ పుస్తకంలో మార్చి ఇతరుల పేర్లను చేరుస్తున్నట్టు ఆరోపించారు. ఇలా జరగరాదనేది తన అభిప్రాయంగా స్పష్టం చేశారు.
బండబూతులు...ముష్టిఘాతాలు...
ఇందుకు త్రిమూర్తి మాట్లాడుతూ ముందు సమావేశం జరగాల్సిందేని పట్టుబట్టారు.దీనిపై ఆగ్రహించిన రమేష్, ‘నువ్వేంట్రా పిల్ల నాకొడకా...చెప్పు తీసుకు కొడతా’ అని హెచ్చరించడంతో, ‘దా...కొట్టు’ అంటూ త్రిమూర్తి అతడిమీదకు వెళ్లాడు. ఇక వెంటవెంటనే పిడిగుద్దుల పర్వం మొదలైంది...బండబూతులు తిట్టుకుంటూ ఒకరిపై దాడిచేసుకున్నారు. కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు తాడిబోయిన రమేష్, టీడీపీ కౌన్సిలర్లు మాదల కోటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు వీరిద్దరినీ బలవంతంగా విడదీశారు. అప్పటికే త్రిమూర్తి చొక్కా పూర్తిగా చిరిగిపోయింది.
తిట్ల పురాణంపై మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం...
టీడీపీ మహిళా కౌన్సిలర్ శాంతకుమారి, మహిళలున్నారని కూడా చూడకుండా బూతులు తిట్టటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో మహిళా కౌన్సిలర్ చెన్ను కళ్యాణి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. దీంతో చైర్‌పర్సన్ తులసీదాస్ సమావేశాన్ని గంట పాటు వాయిదా వేశారు.
22వ అంశంపై అట్టుడికిన కౌన్సిల్...
25వ వార్డులోని పినపాడు చేపల చెరువు లీజుపై 22వ అంశంపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. చెరువు దుర్గంధభరితంగా ఉందని, నీరు తోడి ఎండబెట్టాలని ఆ తర్వాత లీజుకివ్వాలని కోరారు. లీజు రద్దు సాధ్యం కాదని కమిషనర్ శకుంతల తిరస్కరించారు. ప్రజల ప్రాణాల కన్నా ఆదాయమే ముఖ్యమా అంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు లీజ్‌ను రద్దు చేయాలని కోరారు. దీన్ని కొందరు టీడీపీ కౌన్సిలర్లు వ్యతి రేకించారు. ఆ లోపు కో-ఆప్షన్‌సభ్యుడు ఖలీల్ అంశాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆ ఆంశంపై డీసెంట్ ఇచ్చారు. కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
టీడీపీ నేతల మధ్యవర్తిత్వం...
కౌన్సిల్‌లో కొట్లాట తెలిసిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచనపై టీడీపీ నేతలు కొందరు మున్సిపాలిటీకి చేరుకున్నారు. చైర్‌పర్సన్ చాంబరులో కౌన్సిలర్లతో మాట్లాడి సర్దుబాటు చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయంలో కలవాలనీ, అప్పటివరకు గొడవలు వద్దని చెప్పారు. తదుపరి సమావేశాన్ని నిర్వహించి 1, 34 అంశాలు మినహా అజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ తులసీదాస్ ప్రకటించి ముగించారు.