(అ)ధిక్కారం..అరాచకం | elections in tdp distributes money | Sakshi
Sakshi News home page

(అ)ధిక్కారం..అరాచకం

Published Mon, Jul 7 2014 3:17 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

(అ)ధిక్కారం..అరాచకం - Sakshi

(అ)ధిక్కారం..అరాచకం

- ఎన్నికల్లో ఆది నుంచి టీడీపీ వీరంగం
- ‘స్థానిక' పగ్గాల కోసం బరి తెగించిన రాజకీయం
- మెజార్టీలేని చోట్ల ప్రలోభాల తో పైచేయి  
- మొన్న మున్సిపల్, ఎంపీపీల్లోనూ ..
- జెడ్పీటీసీల కొనుగోళ్లకూ వెనుకాడని వైనం
- తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యకాండపై వెల్లువెత్తుతున్న విమర్శలు

 సాక్షి, ఒంగోలు: ముందెన్నడూ లేనంతగా జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు యుద్ధవాతావరణంలో సాగడాన్ని సర్వత్రా ఖండిస్తున్నారు. ‘స్థానిక’ సంగ్రామంలో అధికార టీడీపీ నేతల వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పలుచోట్ల టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

అద్దంకి, పర్చూరు, కొండపి, కందుకూరు, చీరాల, దర్శి తదితర నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతల తలలు పగలడంతో పాటు.. పోలింగ్ అనంతరం గ్రామాల్లో నెలకొన్న గొడవల కారణంగా ఆపార్టీకి చెందిన ఐదారుగురు ప్రాణాలొదిలారు. రెండ్రోజుల కిందట కూడా మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన దళితులను టీడీపీకి ఓట్లేయలేదని బహిష్కరించారు. వారి ఆస్తులను సైతం నిప్పటించి తగులబెట్టారు.
* జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా.. టీడీపీ తమకు మెజార్టీరాని చోట్ల ప్రలోభాల ఎర వేసింది. లొంగని వారిని బలవంతంగా తమవైపునకు తిప్పుకునేందుకు కౌన్సిల్ సమావేశాల్లోనే తెలుగు తమ్ముళ్లు బలప్రదర్శనకు దిగడంపై ఫిర్యాదులు అధికారికంగానే నమోదయ్యాయి.
* మండలప్రాదేశిక ఎన్నికల్లోనూ అచ్చంగా ఇదే జరిగింది. ఎంపీటీసీ సభ్యులను కొనుగోలుచేసి మరీ ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంటామని అధికారపార్టీ నేతలు బహిరంగంగా సవాళ్లు విసిరిన ఘటనలు ప్రభుత్వ అధికారుల సాక్షిగా చోటుచేసుకున్నాయి.

రాష్ట్రపరిపాలనా పగ్గాలు చేపట్టామన్న ధీమాతో.. స్థానికంగా ‘పట్టు’కు టీడీపీ నేతలు బలప్రదర్శనలతో బరితెగిస్తున్న వైనాన్ని చూసి సామాన్య ప్రజానీకంతో పాటు అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా, జెడ్పీపీఠం కైవసానికి ఆ పార్టీ నేతలు నడిపిస్తున్న రాజకీయ కుయుక్తులపై జిల్లావ్యాప్తంగా చర్చసాగుతోంది.
 
దౌర్జన్యకాండ ఆంతర్యమిదే...
జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 31 స్థానాలు, టీడీపీ 25 స్థానాలు గెలుచుకున్నాయి. జిల్లాపరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే 29 మంది సభ్యుల మెజార్టీ సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కన్నా అదనంగా సభ్యుల మెజార్టీ పొందిన వైఎస్సార్‌సీపీకే జెడ్పీపీఠం ఖాయమైంది. అయితే, మొదట్నుంచి అన్ని ఎన్నికల్లో ప్రలోభాల ఆధారంగానే పైచేయిగా నిలుస్తున్న టీడీపీ.. ప్రత్యర్థి జెడ్పీటీసీ సభ్యుల్ని సైతం ప్రలోభానికి గురిచేసింది.

వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన కంభం, కొత్తపట్నం, కారంచేడు జెడ్పీటీసీల్ని టీడీపీ లాక్కెళ్లింది. దీంతో బలం రెండు పార్టీలకూ 28 మంది సభ్యుల చొప్పున ఉంది. అలాంటప్పుడు లాటరీ తీసినా.. పదవి వైఎస్సార్‌సీపీకి దక్కుతుందనే భయాందోళనతో శనివారం టీడీపీ నేతలు రకరకాల విన్యాసాలు చేశారు. వారి దౌర్జన్యకాండను నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులతో వీరంగం చేసి బలప్రయోగం చేశారు.

అయితే, ఇంత జరుగుతున్నా.. వైఎస్సార్‌సీపీ సభ్యులు, నేతలు శాంతంగా మౌనం వహించడంపై.. వారి రాజకీయ పరిణతిని విశ్లేషకులు అభినందిస్తున్నారు. నిజానికి, వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని ఏదో ఒక కారణంగా కేసుల్లో ఇరికించాలని.. కొందరినైనా సమావేశానికి దూరం చేయాలనే ఎత్తుగడతోనే టీడీపీ నానా రకాలుగా రెచ్చగొట్టినట్టు అధికార వర్గాలు సైతం గుర్తించాయి. వారి బలప్రయోగ వ్యూహం ఫలించనందున.. బహిరంగంగానే వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించే వారికి రూ.కోటి ఇస్తామంటూ ఆఫర్‌లివ్వడం తెలుగు నేతల దిగుజారుడుతనాన్ని నిరూపించిందని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శించాయి.
 
ప్రలోభాల బలంతో దక్కిన పదవులివీ..
* అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుండగా, ఇందులో 8 వైఎస్సార్‌సీపీ, 7 టీడీపీ గెలుచుకున్నాయి. మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన వెలమవారిపాలెం ఎంపీటీసీ బుల్లెమ్మాబాయిని టీడీపీ ప్రలోభపెట్టింది. ఆమె అటు ఓటేయగా, ఎంపీపీ పదవి టీడీపీకి దక్కింది. ఇందుకు ప్రతిఫలంగా బుల్లెమ్మాభాయి టీడీపీ తరఫున ఉపాధ్యక్షురాలిగా ఎంపికైంది.
*  కొరిశపాడు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా, ఇందులో 7 వైఎస్సార్‌సీపీ, 7 టీడీపీ గెలుచుకున్నాయి. ఇక్కడ ‘డ్రా’ కావాల్సిన ఎంపీపీ ఎన్నిక... వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన గుడిపాడు ఎంపీటీసీ ఇ.నాగమణి గైర్హాజరుతో టీడీపీకి దక్కింది. ఈమె గైర్హాజరు వెనుక టీడీపీ ప్రలోభాలున్నట్లు ఆరోపణలున్నాయి.
*  కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో 18 ఎంపీటీసీల స్థానాలుండగా, వైఎస్సార్‌సీపీ 11, టీడీపీ 7 చోట్ల గెలిచింది. వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు సభ్యులను టీడీపీ బలవంతంగా లాక్కెళ్లింది. వారిని ప్రలోభపెట్టి ఓట్లేయించుకుని టీడీపీ ఎంపీపీ పదవిని దక్కించుకుంది.
*  చీరాల నియోజకవర్గం చీరాల మండలంలో 24 ఎంపీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్‌సీపీ 10, టీడీపీ 9, బీఎస్పీ 1, స్వతంత్రులు 4 స్థానాలు గెలుపొందారు. ఇక్కడ ఏడుగురు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను టీడీపీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగానే కొనుగోలు చేసింది. ఈ ఏడుగురిలో ఒకరైన గవిని శ్రీనివాసరావు (వైసీపీ తరఫున గెలిచాడు)ను ఎంపీపీ అభ్యర్థిగా అధికారపార్టీ ప్రతిపాదించింది. ఇతరులెవ్వరూ పోటీ  చేయకపోవడంతో ఆయన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
*  దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్‌సీపీకి 8, టీడీపీకి 6 స్థానాలొచ్చాయి. అయితే, వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దర్ని టీడీపీ కొనుగోలు చేయడంతో ఎంపీపీ పదవి అధికార పార్టీ దక్కించుకుంది.
* సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్‌సీపీ 10, టీడీపీ 9 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన కె.తక్కెళ్లపాడు ఎంపీటీసీ గాలి విజ యలక్ష్మిని ప్రలోభపెట్టి టీడీపీ శిబిరంలో చేర్చుకున్నారు. దీంతో ఎంపీపీ పదవి ఆ పార్టీకెళ్లింది.
* చీరాల మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీకి టీడీపీ కంటే అదనంగా వార్డులు దక్కాయి. ఇక్కడ మొత్తం వార్డులు 33 ఉండగా, వాటిల్లో వైఎస్సార్‌సీపీ 15, టీడీపీ 12 వార్డులు గెలుచుకుంది.
*  స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం 6 వార్డుల్లో స్వతంత్రంగా గెలిచారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే ఆమంచి వర్గ కౌన్సిలర్‌లు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో ఆపార్టీ బలం 18కి చేరి చైర్మన్ పదవి టీడీపీకి పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement