రోడ్ల సమస్యలు పునరావృతం కావద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలానికి నగరంలో రోడ్ల సమస్యలు కనిపించవద్దని, రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడంతోపాటు నాణ్యతాపరంగా రాజీ పడవద్దని మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలొచ్చినప్పుడు కాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలతో పనులు చేపట్టాలని, నీటి నిల్వ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో రోడ్ల అభివృద్ధి, ప్రజారవాణా, జంక్షన్ల అభివృద్ధి తదితర పథకాలపై మంత్రి బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో సమీక్ష నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండి దానకిశోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్‌లో 127 రోడ్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని, ఇందులో 57 రోడ్ల పనులను వెంటనే చేపట్టాలన్నారు. మొదటి దశలో వీటికయ్యే ఖర్చు రూ.208 కోట్లలో ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు అందజేస్తామన్నారు. వైట్ టాపింగ్ రోడ్ల క్యారేజ్‌వేలు వచ్చే వర్షాకాలంలోగా పూర్తి చేయాలని సూచించారు. 100 జంక్షన్ల అభివృద్ధి పనుల్లో భాగంగా 30 జంక్షన్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
స్కైవేల ఆటంకాలు తొలగించండి
కేబీఆర్ పార్కు వద్ద స్కైవే పనులకు సంబంధించి నేషనల్‌గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో ఉన్న కేసు త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్సార్‌డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్) పనులపై సవివరంగా సమీక్షించిన మంత్రి.. రూ. 2,631 కోట్లతో ఐదు ప్యాకేజీల్లోని పనులు మందకొడిగా సాగుతుండటంపై ఆరా తీశారు. పనుల జాప్యానికి కారణమైన భూసేకరణ గురించి కేంద్రమంత్రులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45ను వాణిజ్య కేటగిరీగా ప్రకటించనున్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి పాత బొంబారుు హైవే మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొంది ంచాల్సిందిగా మంత్రి ఆదేశించారు.
480 లేన్ కి.మీ. మేర వైట్‌టాపింగ్..
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నగరంలో రూ.1,275 కోట్లతో 480 లేన్ కి.మీ.ల మేర వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొం దించినట్లు తెలిపారు. నగరంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రూ. 75 కోట్లతో 489 పనులు చేపట్టినట్లు చెప్పారు. వీటిల్లో 176 పనులు పూర్తికాగా, మిగతా పనుల్ని త్వరితంగా పూర్తిచేయడంతోపాటు నాణ్యతలో రాజీ పడవద్దని హెచ్చరించారు.
అధికారులపై మంత్రి ఆగ్రహం..
నగరంలో రహదారుల దుస్థితి, ముందుకు సాగని ఎస్సార్‌డీపీ, పురోగతి లేని వైట్‌టాపింగ్ పనులకు సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులపై మంత్రి మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉ న్నారుు. రహదారుల దుస్థితిపై ఎన్ని పర్యాయాలు చెప్పినా ఫలితం కనిపించడం లేదన్నారు. నెలనెలా కన్జర్వెన్‌స సమావేశాలు జరుగుతున్నా శాఖల మధ్య సమన్వయ లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల వల్లే నగరానికి చెడ్డపేరు వస్తోందని, ఎక్కడకు వెళ్లినా ప్రజలు హైదరాబాద్ రోడ్ల గురించి దారుణంగా చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితి మారాలన్నారు.