రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. రోడ్లు వేసిన వెంటనే దెబ్బతినకుండా చూసేందుకు సమగ్రంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రధాన మార్గాల్లోని వెయ్యి కిలోమీటర్ల మేర వైట్ టాపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూనే వాటర్ ప్రూఫ్, ప్లాస్టిక్ రోడ్లు, ఇతర నగరాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. యూనిట్ రేట్ ఖరారు చేసి పేరెన్నికగన్న కంపెనీలకు ఐదు నుంచి పది రోడ్ల నిర్మాణంతోపాటు పదిహేనేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించే యోచన ఉందని వెల్లడించారు.
గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌లతో కలసి నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, పేదల గృహనిర్మాణం తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో రోడ్లపై సర్వే త్వరగా పూర్తి చేసేందుకు నగరాన్ని ఐదారు జోన్లుగా విభజించి, అవసరమైనన్ని కన్సల్టెన్సీలను నియమించాలని కేటీఆర్ సూచించారు. దశల వారీగా ఈ రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పారు.
మరమ్మతులపై అసంతృప్తి
రోడ్లపై గుంతల మరమ్మతు పనుల్లో జాప్యంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రాత్రివేళల్లో కూడా ఈ పనులు జరగాలని, ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌లకు సూచించారు. నాలుగు, ఆరు లేన్లలో రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌లు, డక్టింగ్‌లు కూడా ఉండాలన్నారు. ఫుట్‌పాత్‌ల మధ్య చెట్ల పెంపకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టంచేశారు.
రోడ్ల ఆక్రమణలు తొలగిస్తామని, వీధి వ్యాపారులకు ప్రత్యేక ప్రాంతాల్లో అనుమతిస్తామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి 20 ప్రాంతాల్లో శంకుస్థాపనలు పూర్తి కాగా, మరో 18 బస్తీల్లో ప్రజలు సుముఖంగా ఉన్నారన్నారు. భవననిర్మాణ అనుమతులకు సంబంధించి మినహాయింపులు రాగానే ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడతామన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకాల లబ్ధిదారులు తమ వాటా చెల్లించి ఉంటే వారికి దసరా కానుకగా ఇళ్లను అందజేయనున్నట్లు తెలిపారు. నగరంలోని మురికివాడల్లో ఎన్ని డీ నోటిఫై చేశారు? తిరిగి కొత్తగా ఎన్ని మురికివాడలొచ్చాయో తెలుసుకునేందుకు మళ్లీ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆరు నెలల్లో సాగర్ కాలుష్యం తగ్గిస్తాం
రానున్న ఆరు నెలల్లో హుస్సేన్‌సాగర్ కాలుష్యాన్ని తగ్గించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా హెచ్‌ఎండీఏను ఆదేశించారు. కొన్ని దేశాల్లో జలాశయాల శుద్ధికి బయోడిగ్రేడబుల్ ఫంగస్‌ను వినియోగిస్తున్నారని, ఆ విధానాన్ని హుస్సేన్‌సాగర్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని సూచించారు. వినాయక నిమజ్జనంతో కాలుష్యం పెరగకుండా ఉండేందుకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
స్మార్ట్‌సిటీపై సిస్కోతో ఒప్పందం
హైటెక్‌సిటీ త్వరలోనే స్మార్ట్‌సిటీగా మారనుంది. స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ ైవె ఫై, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్‌లతో సహ వివిధ అంశాల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నోపార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించడంతోపాటు నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు పార్కింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు స్మార్ట్ కియోస్క్‌లు, రిమోట్ ఎక్స్‌పర్ట్ గవర్నెన్స్ సర్వీసులు, సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్, సిటిజెన్ యాప్ వంటివి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన ప్రణాళిక కోసం సిస్కో కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎంవోయూ కుదుర్చుకుంది.
మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సిస్కో ఇండియా ఎండీ పురుషోత్తమ్ కౌశిక్‌లు సంతకాలు చేశారు. సిస్కో సంస్థ ఇప్పటికే టీ హబ్‌తో కలసి పనిచేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో పైలట్‌ప్రాజెక్టుగా హైటెక్ సిటీ ప్రాంతంలో స్మార్ట్‌సిటీ సొల్యూషన్స్‌తో సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చింది.