ఇదే చివరి అవకాశం...
- అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగిస్తాం
- మునిసిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- శిథిల భవనాలు కూలితే కమిషనర్లదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కమిషనర్ల పనితీరుపై పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా కొంత మంది విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వారిపై వారంలోగా చర్యలుంటాయన్నారు. ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగించడం ఖాయమన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న వారి జాబితాను తయారు చేసి తనకు పంపించాలని పురపాలక శాఖ డెరైక్టర్ దానకిశోర్‌ను మంత్రి ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మునిసిపల్ కమిషనర్లతో సోమవారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పట్టణ ప్రాంతాల్లో శిథిల భవనాలను వెంటనే గుర్తించి, కూల్చేయాలని గతంలో పలు మార్లు ఆదేశించినా మునిసిపల్ కమిషనర్లు దాన్ని అమలు చేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. శిథిల భవనాలను తక్షణమే కూల్చేయాలని, వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ భవనాలు పడిపోయి ప్రాణనష్టం జరిగితే కమిషనర్లనే బాధ్యులను చేస్తామని హెచ్చ రించారు. కమిషనర్లందరూ ఉదయాన్నే విధుల్లో ఉండాలన్నారు. ఇకపై నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తానన్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, డెరైక్టర్ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కట్టడాలు కూల్చేయండి...
‘నగరాలు, పట్టణాల్లో వరదలకు దారితీస్తున్న కారణాలను గుర్తించాలి. ప్రతి మునిసిపాలిటీ పరిధిలో జల వనరులు, చెరువుల వివరాలను డిజిటలైజ్ చేయాలి. అన్ని చెరువులు, నాలాల మ్యాపులను సిద్ధం చేసుకోండి. వీటిపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయండి. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు’ అని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కూల్చివేతల్లో పేదవారినే టార్గెట్ చేయకుండా ముందుగా కమర్షియల్ అవసరాల కోసం కట్టిన కట్టడాలను కూల్చేయాలన్నారు. ఇరుకుగా మారిన నాలాలను వెడల్పు చేయాలన్నారు. ఈ పనుల కోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జారుుంట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల అనంతరం ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాడైన రోడ్లకు మరమ్మతులు, ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలన్నారు.
ఒకటి నుంచి నీటి మీటర్ లేకుంటే రెట్టింపు బిల్లు
గ్రేటర్‌లోని గృహ, వాణిజ్య నల్లా కనెక్షన్లకు నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోని పక్షంలో అక్టోబర్ ఒకటి నుంచి రెట్టింపు బిల్లులు వసూలు చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ జలమండలిని ఆదేశించారు. మహానగరంలో మొత్తం 8.75 లక్షల నల్లా కనెక్షన్లకు గాను సుమారు 5 లక్షల నల్లాలకు మీటర్లు లేనందున బోర్డు ఆదాయానికి భారీగా గండి పడుతుండడంతో ఈ నిర్ణయం అమలు చేయాలని సూచిం చారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా జలమండలి పథకాలను ఆయన సమీక్షించారు.
నగరంలో దెబ్బతిన్న, పురాతన పైపులైన్ల నాణ్యత, మన్నికపై నిపుణుల కమిటీతో తక్షణం అధ్యయనం చేయాలన్నారు. పదేళ్లకు పైబడిన పైపులైన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు కెమెరా ఆధారిత సెన్సర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడం ద్వారా బోర్డు ఆదాయం నెలకు వంద కోట్ల మేర సాధించాలని ఆదేశించారు. నగరంలోని 4 లక్షల మ్యాన్‌హోళ్లను జియోట్యాగింగ్ చేయాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.