48 గంటల్లో...సాధ్యమేనా!
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ర్ట మున్సిపల్ శాఖ సోమవారం నుంచి ప్రారంభించనున్న మున్సిపల్ పోర్టల్‌లో ఫిర్యాదుదారుడు సమస్యకు సంబంధించిన ఫొటో తీసి అధికారులకు మెయిల్ చేయూల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అధికారి కంగా ప్రారంభంకానున్న పోర్టల్ లో రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో సమస్యపైనైనా.. ఫిర్యాదు చేయవచ్చు. కేవలం మెయిల్ ద్వారా మాత్రమే పంపించే ఫిర్యాదును పోర్టల్ నిర్వాహకులు పరిశీలించి వాటిని సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు పంపిస్తారు.
వారు 48 గంటల్లోనే సమస్యను పరిష్కరించి సంబంధిత ఫొటోలను హైదరాబాద్‌కు మెయిల్ చేయూల్సి ఉంటుంది. ఇలా రోజులో ఎన్ని ఫిర్యాదులు వస్తే అన్ని సమస్యలను పరిష్కరించిన అనంతరం ఫొటోల ద్వారానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయూన్ని సదరు ఫిర్యాదుదారుని ఫోన్‌కు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. ఇలా చేయడం ద్వారా పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించి పాలనలో పారదర్శకత తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ పోర్టల్ సేవలను త్వరలోనే అన్ని మున్సిపాలిటీలకు విస్తరించనున్నట్టు సమాచారం. వచ్చిన ఫిర్యాదులపై స్పందించని మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారని వినికిడి.
అధికారులకు కత్తి మీద సామే...
జిల్లాలో విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు ఉండగా అందులో 129 వార్డులున్నాయి. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో సమస్యలు పెద్ద మొత్తంలోనే పేరుకుపోయాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగు నీరు, వీధి దీపాలపై అధికంగా సమస్యలు వస్తుంటాయి. ఈ తరహా సమస్యలను పరిష్కరించాలని ఆయా మున్సిపాలిటీల్లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌తో పాటు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు కోకొల్లలుగా ఇప్పటికే వస్తున్నాయి. అయితే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవటంతో సమస్యల పరిష్కారంలో జాప్యం నెలకొంటున్నట్లు అధికారిక వర్గాల నుంచి వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో మున్సిపల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని మున్సిపల్ శాఖ ప్రవేశపెట్టడం అధికారులకు మింగుడుపడటం లేదు. ఓ వైపు సిబ్బంది కొరతను తీర్చాల్సిన అంశాన్ని పక్కన పెట్టి సమస్యలు పరిష్కరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలపై ఆందోళన చెందుతున్నారు. అవసరమైన సిబ్బంది లేకుండా ఇటువంటి సేవలు అందించడానికి ప్రభుత్వం పూనుకోవడం కేవలం ఒక తంతుగానే మిగులుతుందని పలువురు పెదవి విరుస్తున్నారు. సమస్యల నడుమ ప్రారంభిస్తున్న మున్సిపల్ పోర్టల్‌తో పాలనలో ఎంత మేర దక్షత లభిస్తుందో వేచి చూడాలి మరి.