రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్న పావని
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ పరిధిలో పనులు చేసే కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇవ్వకుండా కౌన్సిలర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘మా మంత్రిగారే పర్సంటేజీలు తీసుకోవాలని చెప్పారు’ అని అన్న ఆమె మాటలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రి ఆదేశాల మేరకు శనివారం రాత్రి పావని తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ మేనేజర్ శ్యామ్‌సుందర్‌రావుకు అందజేశారు. ‘ చైర్‌పర్సన్ పదవికి నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్న’ అని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. పావని రాజీనామా విషయం తెలియడంతో రాత్రి 10 గంటల సమయంలో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మేనేజర్ గదిలో పావని రాజీనామా లేఖను అందించారు.
అంతకుముందు ఆమె ఏమన్నారంటే..
‘‘సిరిసిల్ల టౌన్‌లో ఎన్ని కోట్ల పనులొచ్చినా అందరూ అసంతృప్తిగా ఎందుకున్నరంటే.. వార్డుకు ఒక్కరే కాంట్రాక్టరు పనిచేస్తుండు.. మాకు వచ్చేది ఏమీ ఉండదు.. మా మంత్రి గారే చెప్పిండ్రు.. కాంట్రాక్టర్ల నుంచి వన్ పర్సెంటో.. టూ పర్సెంటో.. త్రీ పర్సెంటో ఉంటది’ అంటూ రాజీనామాకు ముందు పావని ఎలక్ట్రానిక్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు పర్సెంటేజీలు కౌన్సిలర్లకు ఇవ్వడం లేదని, కౌన్సిలర్‌గా ఎన్నో ఖర్చులు పెట్టుకున్నారని.. వారికి వన్, టూ పర్సెంట్ ఇవ్వకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. ‘‘మేం కొబ్బరి కాయలు కొట్టి ఏం లాభం? పొద్దున లేచి తిరుగుతున్నం.. వాళ్లు వర్క్‌లు చేసి మాకు ఇచ్చేది ఇవ్వకపోతే ఎట్లా? అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్లకే ఉండాలి’’ అని అన్నారు. ‘మళ్లీ దాన్ని రాజకీయం చేస్తున్నారని అంటున్నరు.
అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్న.. నేను వెళ్లే వార్డుల్లో డ్రైనేజీలు వేస్తుండ్రు.. మోరీలు వేస్తుండ్రు.. పగుళ్లు ఉన్నాయని కాంట్రాక్టర్లకు చెబితే.. బాగు చేస్తున్నామని అంటున్నరు. పనుల్లో వన్ పర్సంటో.. టూ పర్సంటో తీసుకోమని చెప్పిండ్రు’’అని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది మన సిరిసిల్లలోనే కాదు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ నడుస్తోంది.. అందరికి ఇస్తుండ్రో లేదో తెలియదు.. అందరితోపాటు నేనూ తీసుకుంటున్న.. అవి మాసారు చూస్తరు.. నేను రాజకీయం, మహిళా సంక్షేమం, మున్సిపల్ పనులు చూస్త’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment