ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Published Tue, Jul 25 2017 2:51 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు 42వ జన్మదిన వేడుకలు సోమవారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, సినీ నటులు సమంత, మంచు లక్ష్మి తదితరులు ట్వీటర్ ద్వారా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’అని హరీశ్ ట్వీట్ చేయగా, థాంక్యూ బావ అని కేటీఆర్ బదులిచ్చారు. ‘కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని లోకేశ్ ట్వీట్ చేయగా కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
రాఖీ కట్టి.. హెల్మెట్ ఇవ్వండి:కవిత
రాఖీ పండుగ వరకు దేశవ్యాప్తంగా ప్రచారం..
వచ్చే నెలలో జరగనున్న రాఖీ (రక్షా బంధన్) పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా తమ సోదరులకు రాఖీలు కట్టి హెల్మెట్ బహూకరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం తన సోదరుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హెల్మెట్ క్యాంపెయిన్ చేపడుతున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ వాడకపోవడంతో దేశవ్యాప్తంగా రోజుకు 400 మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీ రోజు మహిళలు తమ సోదరునికి రాఖీ కట్టి వారి నుంచి బహుమతి అందుకుంటారని, కానీ ఈ సారి మాత్రం రాఖీతో పాటు తమ సోదరునికి రక్షగా ఉన్నామంటూ హెల్మెట్ కానుకగా ఇవ్వాలని కోరారు. రాఖీ పండుగ వరకు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తామని ఆమె వివరించారు. దీనికోసం సోషల్ మీడియాను వినియోగించుకుంటామని, జాతీయ మీడియా సహకారాన్ని కూడా కోరుకుంటున్నామన్నారు.
Advertisement
Advertisement