మహిళా కార్మికురాలి గొంతు పట్టుకున్న సీఐ ఫిరోజ్‌ | police lotty Charge On Municipal Workers Prakasam | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం

Published Wed, Sep 12 2018 1:35 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

police lotty Charge On Municipal Workers Prakasam - Sakshi

మున్సిపల్‌ కార్మికురాలు గొంతు పట్టుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఐ ఫిరోజ్‌

ఒంగోలు టౌన్‌: ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫెడరేషన్‌ నాయకులు, సీఐటీయూ నాయకులు, కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి దాని ముందు బైఠాయించారు. ఉదయం తొమ్మిది గంటలకు బైఠాయించిన కార్మికులు, నాయకులు గంటసేపు నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఒక అరగంటపాటు నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తామంటూ నాయకులు చెప్పారు. అయితే ఒంగోలు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ సుబ్బారావు నగర పాలక సంస్థ కార్యాలయ గేటుకు తగిలించిన సీఐటీయూ జెండాను తొలగించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు ముందు బైఠాయించిన సీఐటీయూ నాయకులను బలవంతంగా పక్కకు లాగారు. ఆ సమయంలో తీవ్ర పెనుగులాట జరిగింది. సీఐటీయూ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీరాం శ్రీనివాసరావును బలవంతంగా అక్కడ నుంచి లాగుతున్న సమయంలో ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కార్మికులు పోలీసుల చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సీఐ ఫిరోజ్‌ మహిళలని కూడా చూడకుండా     చిడిపోతు ఏసమ్మ అనే మహిళా కార్మికురాలి గొంతు పట్టుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. పోలీసుల చర్యలను ఎండగడుతూ నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి నాయకులు, కార్మికులు ప్రదర్శనగా బయల్దేరి స్థానిక చర్చి సెంటర్‌లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు.

మున్సిల్‌ కార్మికులను చిన్నచూపు చూస్తోంది
మునిసిపల్‌ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఐటీయూ, మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు విమర్శించారు. తొలుత నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన సమయంలో కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శ్రీనివాసరావు, నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీరాం శ్రీనివాసరావు, ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు గొడ్డలిపెట్టుగా మారిన జీఓ నం 279ని రద్దు చేయాలని, జీఓ నం 151 ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయాలంటూ గత రెండేళ్ల నుంచి నిరసనలు, ధర్నాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నెల 5వ తేదీ ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ, డీఎంఈ కన్నబాబులను రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసి సమస్యను విన్నవించగా, ఒకరోజు గడువు కావాలని మంత్రుల బృందం సూచించిందన్నారు.

ఆ తరువాత మరో నాలుగు రోజులు గడువు కావాలని మంత్రుల బృందం పేర్కొందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తాము ఉదయం 9 గంటలకు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి అక్కడే బైఠాయించామని, పదిన్నర గంటలకల్లా తమ ఆందోళన ముగిస్తామంటూ పోలీసులకు చెప్పినప్పటికీ, వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రశాంతంగా జరుగుతున్న బైఠాయింపు కార్యక్రమాన్ని ఉధృతంగా మార్చారన్నారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు వారిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలను తాకరాదని చట్టం చెబుతున్నప్పటికీ పోలీసులు మహిళా కార్మికురాలి గొంతు పట్టుకొని దౌర్జన్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తంగిరాల మహేష్, కొర్నెపాటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, ఫెడరేషన్‌ నాయకులు గోపి, రత్నకుమారి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement