పేదల బంకులు తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది (ఫైల్)
కందుకూరు అర్బన్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఓ చిత్రంలో పేదల పట్ల ధనవంతులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టేలా ఓ పాటను చిత్రీకరించారు. ‘పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు..మా గంజిలోన ఉప్పుచూసి గొణగుడెందుకూ..’ అంటూ చిత్రంలోని ధనవంతులను తన పాటలో సూటిగా ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నే ఇప్పుడు కందుకూరు పట్టణంలోని పేదల నుంచి అధికారులు, పాలకులను ఉద్దేశించి ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్న తీరు అచ్చం అలాగే ఉంది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న సామెత మున్సిపల్ అధికారుల చర్యలు ప్రస్పుటం చేస్తున్నాయి. మున్సిపల్ స్థలంలో ఉన్న లారీ స్టాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని రెండున్నరేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినా రాజకీయ నాయకులు అటువైపు కన్నెతి చూడలేదు. ఏళ్ల నుంచి రాబందుల చేతుల్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చేతగానీ మున్సిపల్ అధికారులు 50 ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న బడుగుజీవులపై కన్నెర్రజేశారు.
ఇదీ.. అసలు కథ
కందుకూరు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి రావిచెట్టు సెంటర్‌లో చేపల మార్కెట్ ఉండేది. దాని చుట్టు పక్కల నిరుపేదలైన 20 ముస్లిం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు అక్కడ అన్న క్యాంటీన్ నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బంకులు తొలగించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బడుగులకు హుకుం జారీ చేశారు. నిరుపేదలైన బంకుల యజమానులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఆయన కూడా పట్టించుకోలేదు. ప్రజాసంఘాల నాయకులు రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదంతా పట్టించుకోని మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో జులుం ప్రదర్శించి బంకులను ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్ కోసం పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న నిరుపేద కుటుంబాల పొట్టకొట్టడం ఎంతవరకు భావ్యమని వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి చిన్న బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న నిరు పేదలను ఖాళీ చేయించడం దుర్మార్గమంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఆగమేఘాలమీద బంకులు ఖాళీ చేయించడం అన్యాయమని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. గుండంకట్ట, ప్రభుత్వ వైద్యశాల తదితర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించిన ధనవంతులు పాలకులు, అధికారులకు కనిపించడంలేదా..అని ప్రశ్నిస్తున్నారు.
పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం
గుండంకట్ట పక్కన రాజకీయ పలుకుబడి కలిగిన బలమైన సామాజికవర్గం వారు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి లారీ స్టాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కోర్టుకు వెళ్లడంతో స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే పోతుల రామారావుకు తెలుసు. ఈ స్థలం అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అనుకూలంగా కూడా ఉంటుంది. లారీస్టాండ్ యజమానులు ఆర్థికంగా, రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీ స్టాండ్ గొడవ ఎందుకన్నట్లు ఎమ్మెల్యే గద్దల జోలిక వెళ్లకుండా పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అన్న క్యాంటీన్ పేరుతో పేద ముస్లిం బతుకలను ఛిద్రం చేశారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండున్నర సంవత్సరాల క్రితం అంకమ్మతల్లి దేవాలయం వద్ద ఉన్న పేదల బంకులను కూడా అధికార పార్టీ నాయకులు నిలువునా తొలగించి వారి పొట్టకొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment