ఆశ పడ్డాడు.. పట్టు బడ్డాడు!
జిల్లాలో అవినీతి ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. సుమారు 15 రోజుల వ్యవధిలో ముగ్గురు చిక్కారు. ఈ నెల పదో తేదీన రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఆమదాలవలస మున్సిపల్ ఏఈ జి.రవి దొరికిపోగా.. 23వ తేదీన ఓ కేసు విషయంలో మూడు వేల రూపాయలు లంచం ఆశించి పొందూరు పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ బెండి త్రినాథ్ పట్టుబడ్డారు. ఇది జరిగి కనీసం 24 గంటలు కూడా గడవకముందే నరసన్నపేట మేజర్ పంచాయతీ ఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు రూ. 35 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయూరు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు.. ఉద్యోగులను కలవరపరస్తున్నాయి.
* రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నరసన్నపేట పంచాయతీ ఈవో
* సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న అధికారులు
నరసన్నపేట: అది నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయం.. శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు గంటల వరకూ ప్రశాంతంగా ఉన్న అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది.. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినట్టు తెలుసుకొని సిబ్బంది ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకుంటూ ఈవో సీహెచ్ ఉమామహేశ్వరావు, అతనికి సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని రెడ్‌హ్యాడెడ్‌గా దొరికిపోవడంతో ఆందోళన చెందారు.
వివరాల్లోకి వెళితే.. మేజరు పంచాయతీ ఈఓగా పనిచేస్తున్న సీహెచ్ ఉమామహేశ్వరరావును పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ పి.రంగరాజు చెప్పారు. వంశధార కార్యాలయానికి సమీపంలోని స్థలాల్లో ఒక ఇంటి ప్లానుకు సంబందించి రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు వెల్లడించారు. ఈఓతోపాటు అతనికి సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని కూడా కేసులో బాధ్యునిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పోలాకి గ్రామానికి చెందిన పొట్నూరు వెంకటరమణ నరసన్నపేటలో ఇల్లు నిర్మాణానికి ప్లాన్ అప్రోవల్ కావాలని పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో ప్లాన్ అప్రోవల్ ఇచ్చారు. అరుుతే సకాలంలో ఇల్లు నిర్మాణం కాలేదు. దీంతో ప్లాన్ అప్రోవల్‌కు కాలపరిమితి దాటింది. దీన్ని గమనించిన ఈఓ ఉమామహేశ్వరావు కొత్తగా ప్లాన్ పెట్టాలి, లేదా దీనిని రెన్యువల్ చేయాలని.. దీనికి కొంత ఖర్చు అవుతోందని వెంకటరమణకు చెప్పారు. అన్నీ సక్రమంగా ఉన్నా ప్లాన్ అప్రోవల్ రెన్యువల్‌కు రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. డబ్బు ఎందుకు ఇవ్వాలని వెంకటరమణ వాదించారని, అరుుతే డబ్బు ఇవ్వనిదే పనులు జరగవని ఈవో తేల్చి చెప్పినట్టు డీఎస్పీ వివరించారు.
ఈవోకు రూ. 35 వేలు ఇచ్చేందుకు వెంకటరమణ అంగీకరించి.. తరువాత తమను ఆశ్రరుుంచినట్టు తెలిపారు. దీంతో 35 వేల రూపాయలను వెంకటరమణకి ఇచ్చి పంపించామని, ఆ సొమ్మును ఉమామహేశ్వరరావుకు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. తీసుకున్న డబ్బు అక్కడే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రఘుపాత్రుని శేఖర్‌కు ఈవో ఇవ్వడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టుకు తరలించామన్నారు. కాగా చీకటి పడిన తరువాత మారుతీనగర్‌లోని ఈఓ ఇంటి వద్ద కూడా తనిఖీలు చేపట్టారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ కె.శ్రీనివాసరావు ఉన్నారు.
రికార్డులు ఇచ్చేందుకు ససేమిరా
ఏసీబీ అధికారులకు ఒక దశలో కొన్ని రికార్డులు ఇచ్చేందుకు పంచాయతీ సిబ్బంది ససేమిరా అన్నారు. ప్లాన్ అప్రోవల్‌కు చెందిన రికార్డులు కావాలని ఏసీబీ అధికారులు కోరగా కాగితాలు లేవని తప్పించుకోవడానికి చూశారు. దీంతో అధికారులు మరింత ఒత్తిడి చేయడంతో మరో గది నుంచి తీసుకొచ్చి ఇచ్చారు.